China: లాక్‌డౌన్ ఆంక్షల దిగ్బంధనంలో చైనా నగరాలు.. షాంఘైలో ఒక్కరోజులో 51 మరణాలు…

- Advertisement -

బీజింగ్: చైనాలో మళ్లీ కరోనా వైరస్ తన తడాఖా చూసిస్తోంది. ఇప్పటికే అక్కడ పలు నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతుండగా.. తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు విధించారు.

మరోవైపు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అంతేకాదు, బీజింగ్ నగరం మొత్తం లాక్‌డౌన్ చేస్తారనే భయంతో అక్కడి ప్రజలు ముందుజాగ్రత్తగా సూపర్ మర్కెట్లలో ఉత్పత్తులను ఖాళీ చేస్తున్నారు.

చదవండి: Ukrine War: జెలెన్‌స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ, అవసరమైన సాయంపై భరోసా…

రెండున్నర కోట్లకుపైగా జనాభా కలిగిన షాంఘై నగరంలో గత మూడు వారాలుగా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే అక్కడ మరో 51 మంది కోవిడ్ బాధితులు మరణించారు.

దీంతో అక్కడ ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 100ను దాటింది. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు ఇప్పట్లో సడలించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై షాంఘై నగర వాసులు మండిపడుతున్నారు.

బీజింగ్‌లో పెరుగుతున్న కేసులు…

కొన్ని రోజులుగా చైనా రాజధాని బీజింగ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 30 లక్షలకుపైగా జనాభా ఉన్న చావోయాంగ్‌ జిల్లా‌లో ఇప్పటికే 46 కేసులు వెలుగుచూశాయి.

దీంతో ఆ జిల్లాలోని కార్యాలయాలన్నింటినీ అధికారులు మూసి వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపైనా ఆంక్షలు విధిస్తున్నారు. అంతేకాదు, జిల్లా వ్యాప్తంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇక చైనాలోని ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతాలైన అన్‌యాంగ్, డాన్‌డోంగ్ ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి.

చైనా రాజధాని బీజింగ్ జనాభా 2.1 కోట్లు. అక్కడ ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు బయటికొచ్చాయి. మున్ముందు కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉండడంతో అక్కడి అధికారులు వైరస్ కట్టడి కోసం అంక్షలు విధిస్తున్నారు.

బీజింగ్‌లోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంతో.. నగరం మొత్తం లాక్‌డౌన్ అమలు చేస్తారని ఆందోళన అక్కడి ప్రజల్లో మొదలైంది.

దీంతో ఎందుకైనా మంచిదని అక్కడి ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం సూపర్ మార్కెట్లపై ఎగబడుతున్నారు. బియ్యం, కూరగాయలు, నూడిల్స్‌తోపాటు ఇతర ఆహార పదార్థాలు అవసరానికంటే అధికంగా కొనుగోలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సెంట్రల్ బీజింగ్‌‌‌లోని సూపర్ మార్కెట్ల ముందు విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ప్రజలు క్యూ లైన్లలో బారులుదీరుతుండడంతో వారికి సరిపడా సరుకులు అందించేందుకు సూపర్ మార్కెట్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు.

 

 

- Advertisement -