రాజకీయాల్లో మరో సంచలనం.. రాజకీయ పార్టీతో వచ్చేస్తున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో సంచలనం. కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పాలని భావించిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు వార్తలు రాగా, తాజాగా ఈ ఉదయం ఆయన ఓ ట్వీట్ చేసి సంచలనం రేపారు.

పదేళ్ల రోలర్ కోస్టర్ ప్రయాణం తర్వాత ప్రజలకు సుపరిపాలన (జన్ సురాజ్) అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌తో ఆయన రాజకీయాల్లోకి రావడం పక్కా అని తేలిపోయింది. సొంతరాష్ట్రమైన బీహార్ నుంచే ఆయన అడుగులు వేయనున్నట్టు తెలిపారు.

కాగా, ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి జవసత్వాలు నింపేందుకు పీకే కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్‌ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించారు.

ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పీకే చర్చలు జరపడంతో ఆయన తీరుపై కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో పీకే చేరికకు ఫుల్‌స్టాప్ పడింది.

ఫలితంగా కాంగ్రెస్‌లో కీలక స్థానాన్ని ఆశించిన ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల వ్యూహరచన కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పిస్తామని సోనియా గాంధీ చెప్పడంతో మనసు మార్చుకున్న ఆయన కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సొంత పార్టీ ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

 

- Advertisement -