మాస్కో: ఉక్రెయిన్-రష్యా నడుమ సాగుతోన్న యుద్ధం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ లొంగిపోవాలని, లేదంటే అణ్వస్త్రాలు ప్రయోగించడానికి కూడా తాము ఏమాత్రం వెనుకాడమంటూ రష్యా ఇప్పటికే ప్రకటించింది.
రష్యా ప్రకటనతో అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఆలోచనలో పడ్డాయి. అయినప్పటికీ మరోవైపు అమెరికా, నాటో కూటమి ఉక్రెయిన్‌కు మద్దతును ఉపసంహరించుకోవడం లేదు.
పైగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అమీ తుమీ తేల్చుకోమంటూ ఉక్రెయిన్‌ను మరింతగా ప్రోత్సహిస్తున్నాయి. యుద్ధం చేయడానికి అవసరమైనవన్నీ తామిస్తామంటూ అభయహస్త ఇవ్వడమేకాదు, ఆ మేరకు సరఫరా కూడా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం బుధవారం( జూన్ 1, 2022 ) నాటికి 98వ రోజుకు చేరింది. యుద్ధం ప్రారంభమై ఇన్ని నెలలు గడిచినా.. అమెరికా దాని మిత్ర దేశాల అండ చూసుకుంటూ ఉక్రెయిన్ ఏమాత్రం లొంగకపోవడంతో రష్యా ఇక తన అణ్వస్త్రాలను బయటికి తీసింది.
తన సత్తా ఏమిటో అమెరికా దాని మిత్ర దేశాలకు తెలియజేసే ఉద్దేశంతో యుద్ధం మొదలైన నాటినుంచి పలుమార్లు తన వద్ద ఉన్న అణ్వస్త్రాలతో అణుయుద్ధ విన్యాసాలను రష్యా నిర్వహించింది.
తాజాగా మళ్లీ 1000 మంది సిబ్బందితో దేశ రాజధాని నగరం మాస్కోలోని ఇవనోవ్ ప్రావిన్స్‌లో అణ్వస్త్ర యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఈ విషయాన్ని తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
100 వాహనాలు, యార్స్ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లను కూడా ఈ ప్రదర్శనలో ఉపయోగించారు. మే నెల మొదటి వారంలో కలినిన్ గ్రాడ్ నగరంలో అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులతో రష్యా మాక్ డ్రిల్ నిర్వహించింది.
అలాగే బాల్టిక్ సముద్రంపై ఉన్న ఎంక్లేవ్‌లో ఇస్కాండెర్ మొబైల్ బాలిస్టిక్ మిస్సైల్ వ్యవస్థకు చెందిన ఎలక్ట్రానిక్ ప్రయోగ వ్యవస్థతో కూడా మాక్ డ్రిల్ నిర్వహించింది.
ఈ ప్రాక్టీస్ డ్రిల్‌లో భాగంగా శత్రుదేశం వైమానిక స్థావరాలు, కమాండ్ పోస్టులు, మౌలిక సదుపాయాలు, సైనిక పరికరాలపై ఒకటి అంతకంటే ఎక్కువసార్లు మిస్సైల్స్ ప్రయోగించేలా సాధన జరిపింది.
అంతేకాదు, అణ్వస్త్ర దాడులు జరిపిన అనంతరం వెలువడే రసాయన, రేడియో ధార్మికత వెలువడే పరిస్థితుల్లో సైనికులు ఎలా తప్పించుకోవాలి, అలాగే శత్రుదేశాలు జరిపే అణ్వస్త్ర దాడుల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో కూడా తమ సైనికులకు నేర్పింది.