Ukrine War: జెలెన్‌స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ, అవసరమైన సాయంపై భరోసా…

- Advertisement -

కీవ్: ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి గట్టి భరోసా ఇచ్చింది. సైనిక బలగాల పరంగా, ఇతరత్రా అన్ని విషయాల్లోనూ పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొంది.

అమెరికా తరపున ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు ఈ మేరకు సోమవారం ప్రకటించారు.

ఆదివారం రాత్రి వారు పోలండ్-ఉక్రెయిన్ సరిహద్దులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రహస్యంగా కలిశారు. దాదాపు మూడు గంటలపాటు ఆయనతో భేటీ అయ్యారు.

అయితే ఈ భేటీ రహస్యంగా జరగడం, విలేకరులపైనా ఆంక్షలు ఉండడంతో.. వీరు ఎక్కడ భేటీ అయ్యారు? ఏయే విషయాలపై చర్చించారు? అనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.

రష్యాతో గత రెండు నెలలుగా ఉక్రెయిన్ పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక అమెరికాకు సంబంధించిన అత్యున్నత స్థాయి నేతలు ఉక్రెయిన్‌కు రావడం ఇదే మొదటిసారి.

అమెరికా అత్యున్నత స్థాయి అధికారులతో జరిగిన రహస్య భేటీ గురించి ఆ తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. అమెరికా మంత్రులతో భేటీ ప్రోత్సాహకరంగా, ప్రభావవంతంగా ముగిసిందన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమకు చేస్తున్న సాయం మరవలేనిదని పేర్కొన్నారు. తమ సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు జెలెన్‌‌‌స్కీ వెల్లడించారు.

దురహంకార రష్యా దాడిని తిప్పికొట్టి, తమ దేశానికి విజయం సాధించిపెట్టడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఉక్రెయిన్ విజయం ఖాయం.. ’’

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ విజయం ఖాయమంటూ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. పోలండ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గెలుపు కోసం జెలెన్‌స్కీ తపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌కు తమ వంతు చేయూత అందించాలని కూడా తాము భావిస్తున్నామన్నారు. తగిన యుద్ధ సామగ్రి, అమెరికా అండదండలు ఉంటే రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తప్పక విజయం సాధిస్తుందన్నారు.

రష్యా భవిష్యత్తులో మరే దేశంపైనా ఇలాంటి దురాక్రమణకు పాల్పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అమెరికాకు తెలుసన్నారు.

జెలెన్‌స్కీ మరిన్ని యుద్ధ ట్యాంకులు, పేలుడు పదార్థాలు అడుగుతున్నారని.. వెంటనే ఆ మేరకు సాయం అందుతుందని, అలాగే ఉక్రెయిన్‌కి ఆర్థికసాయం కింద మరో 30 కోట్ల డాలర్ల నగదును కూడా అమెరికా అందిస్తుందని ఆస్టిన్ చెప్పారు.

‘‘అందుకే నేరుగా వచ్చాం..’’

రష్యాపై ఒత్తిడి తీవ్రం చేయడంలో 30 దేశాలతో కలిసి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తున్నాయని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కబళించాలనుకున్న రష్యాకు ఓటమి తప్పదని ఉక్రెయిన్‌లో అమెరికా కొత్త రాయబారి బ్రిడ్జెట్ బ్లింకెన్ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారిగా బ్లింకెన్ నియామకాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్‌కు సాయంపై అమెరికా నుంచి భరోసా లభించిందని, ఆ విషయమై జెలెన్‌స్కీతో మాట్లాడేందుకే తాము ఉక్రెయిన్‌కు వెళ్లామని తెలిపారు.

అనంతరం పోలండ్ నుంచి బ్రిడ్జెట్ బ్లింకెన్ వాషింగ్టన్‌కు బయలుదేరగా.. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాత్రం జర్మనీకి బయలుదేరారు. మంగళవారం జర్మనీలో జరిగే నాటో రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

 

- Advertisement -