హైదరాబాద్: నభూతో నభవిష్యత్ అనేలా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం తేదీ ఎట్టకేలకు ఖరారు అయింది.
సచివాలయంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న అమరవీరుల స్థూపం, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ తేదీలు కూడా ఖరారు అయ్యాయి.
మొదటగా నెక్లెస్ రోడ్ ఎదురుగా నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది.
ఆ రెండూ వేర్వేరు తేదీల్లో…
బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30న, అలాగే మరో ప్రతిష్టాత్మక కట్టడం అమరవీరుల స్థూపాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రారంభించనున్నారు.
నిజానికి కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న సచివాలయం, అమరవీరుల స్థూపం ప్రారంభించాలని మొదట ప్రభుత్వం భావించినా… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడింది.
తాజాగా ఈ మూడింటి ప్రారంభోత్సవాలను ఒకే రోజు కాకుండా వేర్వేరు తేదీల్లో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ప్రజల్లో మైలేజ్ పెంచుకునేలా వేర్వేరు తేదీల్లో అట్టహాసంగా ప్రారంభించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది.