AP SSC Results: ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల.. బాలికలే టాప్, జూలై 6 నుంచి సప్లిమెంటరీ…

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలు అనుకున్నట్లుగానే సోమవారం విడుదల అయ్యాయి. విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు.

6,15,908 మంది పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారని, ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారని మంత్రి వెల్లడించారు.

రెండేళ్ల తరువాత ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయగా.. ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా.. అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈసారి గ్రేడ్లు కాకుండా మార్కులు ఇచ్చారు.

ఫలితాల్లో ప్రకాశం జిల్లా 78.3 ఉత్తీర్ణత శాతం సాధించగా.. అనంతపురం జిల్లా 49.7 ఉత్తీర్ణత శాతమే సాధించగలిగింది. ఇక రాష్ట్రంలోని 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ అవకపోవడం గమనార్హం.

విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ రోల్ నెంబర్ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఏపీలో పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మొదలై మే 9 వరకు జరగ్గా.. మే 13 నుంచి 22 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి జూన్ 6న ఫలితాలు విడుదల చేశారు.

జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు…

ప్రస్తుతం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.

ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు రేపటి నుంచే (7 జూన్ 2022) ప్రారంభం అవుతుందని, వీరి కోసం ఈ నెల 13 నుంచే ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అలాగే సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసి, వీరు కూడా రెగ్యులర్ విద్యార్థులతోపాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని బొత్స వివరించారు.

 

- Advertisement -