అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రాజధాని అమరావతిలోని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలు విడుదలవగానే నేరుగా అభ్యర్థుల సెల్‌ఫోన్లకు ర్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా చేరాయి. వెబ్‌సైట్లలో కూడా ఎంసెట్ ఫలితాలు అందుబాటులో ఉంచారు. ఏపీ ఎంసెట్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,82,901 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. వీరిలో ఇంజినీరింగ్‌కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్యవిభాగ పరీక్షలకు 81,916 మంది హాజరయ్యారు.
ఇక ఇంజినీరింగ్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పినిశెట్టి రవితేజ మొదటి ర్యాంకు సాధించాడు. మెడికల్‌లో వెంకటసాయి స్వాతి మొదటి ర్యాంక్ సాధించింది. ఈ నెల 10నుంచి ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కాగా, గత నాలుగేళ్లలో జూన్‌లో ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల కారణంగా ఏపీఎంసెట్ ఫలితాల్లో తీవ్ర జాప్యం జరిగింది. తెలంగాణకు చెందిన 36,698 విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరయ్యారు.