నర్సరావుపేటలో ఉద్రిక్తత! జల్లయ్య మృతదేహం తరలింపు, టీడీపీ నాయకుల గృహ నిర్బంధం…

- Advertisement -

అమరావతి: ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న టీడీపీ కార్యకర్త జల్లయ్య మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టంపై ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆందోళనకు దిగడంతో నర్సరావుపేట ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తమను సంప్రదించకుండానే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని ఆరోపిస్తూ జల్లయ్య కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

పోస్టుమార్టం అనంతరం జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు ఏరియా ఆసుపత్రి నుంచి బొల్లాపల్లి మండలం రావులపురం తరలించేందుకు ప్రయత్నించగా బంధువులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో జల్లయ్య బంధువులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే పోలీసులు బలవంతంగా జల్లయ్య బంధువులను తోసివేసి అతడి మృతదేహాన్ని తరలించారు.

పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను అతడి ప్రత్యర్థులు శుక్రవారం కిరాతకంగా హతమార్చారు. దుర్గిలో బ్యాంకు పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

శనివారం జల్లయ్య అంత్యక్రియల సందర్భంగా కూడా పోలీసులు ఎలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

గృహనిర్బంధంలో టీడీపీ నాయకులు…

టీడీపీ కార్యకర్త జల్లయ్య మృతిపై పార్టీ తరుపున ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని నియమించారు. జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అతడి అంత్యక్రియల్లో పాల్గొనాలంటూ ఆదేశించడంతో వారంతా శనివారం జంగమేశ్వరపాడుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే పోలీసులు వారిని జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొననీయకుండా టీడీపీ నాయకులను, కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

టీడీపీ నాయకులు నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్నలతోపాటు జిల్లాలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరగా.. వీరంతా నర్సరావుపేటకు రాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

టీడీపీ నాయకులను ఎక్కడికక్కడే ముందస్తు జాగ్రత్తగా తమ అదుపులోనికి తీసుకున్నారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు.

గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును, తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

విజయవాడలో టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటివద్దే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పొందుగుల వద్ద కొల్లు రవీంద్రను, ప్రత్తిపాటి పుల్లారావులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు వారిని దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సంతమాగులూరు వద్ద బీద రవిచంద్రను అడ్డుకున్న పోలీసులు.. అనంతరం ఆయన్ని వినుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంఠి బ్రహ్మారెడ్డిని కూడా గృహనిర్బంధం చేశారు.

పోలీసులు తనను గృహ నిర్బంధం చేయడంపై నక్కా ఆనందబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో తనను ఆపుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్రమంగా తనను నిర్బంధిస్తే కోర్టులో పిటిషన్ వేస్తానంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు ఆడితే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

‘‘పట్టపగలే హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేయలేకపోయారు.. పరామర్శకు వెళ్లబోతున్న మమ్మల్ని అడ్డుకోవడం దుర్మార్గం..’’ అంటూ ఆనందబాబు వ్యాఖ్యానించారు.

 

- Advertisement -