అమరావతి: పల్నాడులో హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం ఆరోపించారు.
ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను మట్టుబెట్టారని.. ప్రత్యేక కోర్టు పెట్టి ఈ హత్య కేసుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు జల్లయ్య మృతదేహానికి నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో బలవంతంగా పోస్టుమార్టం చేయించారంటూ చంద్రబాబు తప్పుపట్టారు.
‘‘ఇది మానవత్వమేనా?..’’
ఆ తరువాత కూడా ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పకుండా అక్కడ్నించి తరలించారంటూ.. కనీసం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వరా? ఇది మానవత్వమేనా? అన్నారు.
అంతటితో ఆగకుండా జల్లయ్య అంత్యక్రియలకు హాజరవుతున్న టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని గృహనిర్బంధం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కాపాడడం చేతకాని పోలీసులు, అతడి అంత్యక్రియలకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు.