Divyavani: టీడీపీకి దివ్యవాణి రాజీనామా! పార్టీలో అవమానాలు భరించలేకే అంటూ…

- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ప్రకటించారు.

కొంతకాలంగా పార్టీలో అన్ని కార్యక్రమాలకు తనను దూరంగా పెడుతున్నారని, కనీసం ప్రెస్‌మీట్లు పెట్టే విషయంలో కూడా పార్టీ నాయకులు ఎవరూ సహకరించడం లేదని ఆమె వాపోయారు.

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి తనకు ఎదురవుతున్న అవమానాల గురించి వివరించేందుకు ప్రయత్నాలు చేయగా.. వాటినీ అడ్డుకున్నారని దివ్యవాణి ఆరోపించారు.

బుధవారం కూడా చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం తాను ప్రయత్నించానని, మధ్యాహ్నం 2.45 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు కూడా ఆయన చాంబర్‌లోకి తనను వెళ్లనివ్వలేదన్నారు.

రెండ్రోజుల క్రితం టీడీపీ కార్యాలయం నుంచి ఓ మీడియా సంస్థ ప్రతినిధులు తనకు ఫోన్ చేసి.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారని దివ్యవాణి పేర్కొన్నారు.

అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు ఎందుకు తెచ్చుకోవడం.. తానే రాజీనామా చేస్తే సరిపోతుందనే ఆలోచనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాను ట్విట్టర్ ద్వారా ప్రకటించానని వివరించారు.

ఈ విషయమై టీడీపీ నుంచి ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని దివ్యవాణి విలేకరులకు చెప్పారు. ‘‘దివ్యవాణి.. నువ్వెందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నావు? నీకొచ్చిన కష్టమేమిటి అని ఒక్కరు కూడా నన్ను అడగలేదు..’’ అని పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -