

సూర్యాపేట: ఓ మహిళను కొంతమంది దుండగులు హత్య చేయడమే కాకుండా.. ఆమె మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రాంతంలోకి తిసుకెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించారు. సగం కాలిన మహిళ తల, వెన్నెముక వ్యవసాయ క్షేత్రంలో ఉండటం కలకలం సృష్టించింది. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం వేపలమాదారంలో వెలుగు చూసింది.
డీఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం… వేపలమాదారం పరిధిలోని రఘునాథపాలెంకు చెందిన రైతు తుక్కిశెట్టి ఆంజనేయులు మిరప పంటకు నీరు పెట్టేందుకు తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు.
నీరు పెడుతున్న క్రమంలో సగం కాలిన మహిళ అవయవాలను గమనించి.. విషయాన్ని గ్రామస్థులకు తెలిపాడు. గ్రామస్థులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, రూరల్ సీఐ రవి పరిశీలించి ఆధారాలు సేకరించారు.
వీఆర్‌ఏ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు డీఎస్పీ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు మహిళను ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చివేసే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి కోదాడ రూరల్ సీఐ రవి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.







