పాట్నా: బీహార్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ఈస్ట్ చంపారన్ జిల్లాలో మంగళవారం ఓ బాలిక(17)పై సామూహిక అత్యాచారం జరగ్గా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కదులుతున్న బస్సులోనే ఆ బాలికపై నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్, హెల్పర్ సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో ఆ బాలిక బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆమె వెస్ట్ చంపారన్‌లోని బెట్టయ్య ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది.
బెట్టయ్యకే వెళుతున్నట్లు సదరు బస్సు డ్రైవర్ చెప్పడంతో ఆ బాలిక నమ్మి బస్సెక్కింది. ఆమె ఎక్కగానే మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి స్పృహ తప్పగానే నలుగురు కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.
తిరిగి బాలికకు స్పృహ వచ్చేసరికి బస్సులో ఎవరూ లేరు. బస్సు డోర్లు వేసి ఉన్నాయి. బాలిక అరుపులను గమనించి అటుగా వెళుతున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆ బాలికను వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసపత్రికి తరలించారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు.
గ్యాంగ్‌రేప్ జరిగిన బస్సును సీజ్ చేసిన పోలీసులు, ఈ అకృత్యానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్నామని, సరైన ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.