షాకింగ్: ఆటో డ్రైవర్ల అఘాయిత్యం.. హైదరాబాద్‌లో పట్టపగలే యువతిపై అత్యాచారం!

- Advertisement -

హైదరాబాద్: నగరంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. మంగళవారం తన ఆటోలో ఎక్కిన ఓ యువతి(20)పై ఆటో డ్రైవరే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 

దగ్గరి దారంటూ ఆమెను ఏమార్చి.. ఆటోను దారి మళ్లించిన సదరు ఆటోడ్రైవర్ ఆమె పాలిట కీచకుడిగా మారి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఇటీవల గాంధీ ఆసుపత్రిలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన ఇంకా ఒక కొలిక్కి రాకమునుపే.. తాజాగా సంతోష్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. 

వివరాల్లోకి వెళితే… నగరంలోని పిసల్‌బండ ప్రాంతంలో నివసిస్తోన్న యువతి మైలార్‌దేవ్ పల్లిలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. 

రోజూ తన విధులు ముగిసిన తరువాత అక్కడ్నించి ఆటోలో పిసల్‌బండకు వెళుతుండేది.  మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన ఇంటికి వెళ్లేందుకు సంతోష్‌నగర్ వద్ద ఆటో ఎక్కింది.

ఆ సమయంలో ఆటోలో ఆమెతోపాటు మరో మహిళ, ఇద్దరు యువకులు ఉన్నారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆటోలో ఉన్న మరో మహిళ దిగిపోగా.. ఆటోలో డ్రైవర్‌తోపాటు ఆ ఇద్దరు యువకులు ఉన్నారు.  

షార్ట్‌కట్ అంటూ యువతిని ఏమార్చి…

ఆ సమయంలో తనపై ఏదో మత్తు మందు ప్రయోగించారని, బుధవారం ఉదయం తనకు మెలకువ వచ్చి చూసుకునే సరికి తాను షాహిన్‌నగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నానని పేర్కొంది.

తనపై ఆ ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు సంతోష్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

దగ్గరి దారి అంటూ ఆమెను నమ్మించి ఆటోను దారి మళ్లించిన డ్రైవర్ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని, అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై దక్షిణ మండలం డీసీపీ గజరావ్ భూపాల్ మాట్లాడుతూ.. బాధితురాలు షాక్‌కు గురవడం వల్ల ఘటనకు సంబంధించిన వివరాలు సక్రమంగా చెప్పలేకపోతోందని తెలిపారు. 

ఆమెపై ఆటో డ్రైవర్ ఒక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడా? లేక ఆ సమయంలో బాధితురాలు చెప్పినట్లుగా ఆటోలో ఉన్న ఆ ఇద్దరు యువకులకు కూడా ఇందులో ప్రమేయం ఉందా? వారికి, ఆటో డ్రైవర్‌కి ఉన్న సంబంధం ఏమిటి?

వారు కూడా ఆటోడ్రైవర్లేనా? బాధితురాలు చెప్పినట్లు నిజంగా ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందా? అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

ప్రస్తుతం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించామని, వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నామని డీసీపీ వివరించారు. 

సంతోష్‌నగర్‌ నుంచి షాహిన్‌నగర్‌ వరకు ఉన్న అన్ని దారుల్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజిని అధ్యయనం చేస్తున్నామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గజరావ్ భూపాల్ తెలిపారు. 

- Advertisement -