హైదరాబాద్: చిన్నప్పటి నుంచి కలిసిమెలసి తిరిగిన స్నేహితుల మధ్య ప్రేమ వ్యవహారం అగ్గిరాజేసింది. కోపంతో రగిలిపోయి ఒకరిపై ఒకరు దాడిచేసుకునేంత వరకు వెళ్లింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని రహమత్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బంగారు మైసమ్మ ఆలయం వద్ద నివసించే సాయిచైతన్య (19) ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్నాడు. సాయి తన బంధువైన అమ్మాయి(17)పై ఇష్టం పెంచుకున్నాడు.
ఈ విషయం తన చిన్ననాటి స్నేహితులైన ఇద్దరికి చెప్పి తన ప్రేమ విషయంలో సాయం చేయాలని కోరాడు. అందుకు వారు సరేనన్నారు. సాయి ప్రేమించిన అమ్మాయిని ఒప్పించేందుకు వారు ఏడాదిగా ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల ఆమె సాయి ప్రేమను తిరస్కరించింది. దీంతో అతడి స్నేహితుల్లో ఒకడు ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ఆమెకు వాట్సాప్ మెసేజ్ పంపాడు. అతడిని కూడా ఆమె తిరస్కరించింది.
ఆ తర్వాత మరో స్నేహితుడు కూడా ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌ను కూడా ఆమె అంగీకరించలేదు.
తాను ప్రేమించిన అమ్మాయికి స్నేహితులు ప్రపోజ్ చేసిన విషయం తెలిసిన సాయిచైతన్య వారిని నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో అటోఇటో తేల్చుకుందామంటూ ముగ్గురూ సవాలు విసురుకున్నారు.
అందుకు స్థానిక ‘నిమ్స్‌మే’ దగ్గర నిర్జన ప్రదేశాన్ని వేదికగా ఎంచుకున్నారు. ముగ్గురూ అక్కడికి చేరుకున్న తర్వాత వారి మధ్య మరోమారు గొడవ జరిగింది.
ఈ క్రమంలో ఓ స్నేహితుడి మెడపై సాయిచైతన్య బ్లేడుతో దాడిచేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
సాయిచైతన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడికి ఉపయోగించిన బ్లేడును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.