ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ఖాతాలకు జరిపే చెల్లింపు లావాదేవీలలో క్రెడిట్ కార్డులను కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో డిజిటల్ లావాదేవీలకు మరింత ప్రోత్సాహకరంగా మారనుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ మేరకు త్వరలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)కి ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పేటీఎం, జీపే, ఫోన్‌పే వంటి యూపీఐ ఆధారిత యాప్‌లు ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులను అనుమతిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల సదుపాయం కేవలం వ్యాపార సంస్థలకు మాత్రమే ఉంది. వ్యక్తిగత యూపీఐ లావాదేవీలకు వర్తించడం లేదు.
ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో.. రాబోయే రోజుల్లో వ్యక్తిగత లావాదేవీలలోనూ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు కలుగనుంది.
డిజిటల్ లావాదేవీల్లో యూపీఐదే కీలక పాత్ర…
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. మొన్న మే నెలలో యూపీఐ ద్వారా జరిపిన లావాదేవీల విలువ రూ.10 లక్షల కోట్లు దాటింది.
గత ఏడాది మే నెలలో యూపీఐ ద్వారా జరిపిన లావాదేవీల విలువ రూ.5 లక్షల కోట్లు ఉండగా.. ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో లావాదేవీలు జరగడం గమనార్హం.
యూపీఐ సేవలు మన దేశంలో 2016లో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలు మరింత పెరగడం ఖాయం.
క్రెడిట్ కార్డుతో చెల్లింపు ఇలా…
ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు లావాదేవీ జరపాలంటే స్వైపింగ్ మిషను తప్పనిసరిగా అవసరం అయ్యేది. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో.. ఈ స్వైపింగ్ అవసరం తప్పిపోయినట్లే.
యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి క్రెడిట్ కార్డును అనుసంధానించడంతో జస్ట్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లేదంటే మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకొని చెల్లింపు జరపొచ్చు.
అయితే చెల్లింపు జరిపే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. లావాదేవీని పూర్తి చేసే సమయంలో దానిని ఎంటర్ చేయాల్స ఉంటుంది.
తొలుత రుపే క్రెడిట్ కార్డు ద్వారా…
అయితే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరాల ప్రకారం.. మొదట ఈ సదుపాయం రుపే క్రెడిట్ కార్డులకు మాత్రమే దక్కుతుంది.
ఆ తరువాత వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలకు చెందిన క్రెడిట్ కార్డులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద యూపీఐ చెల్లింపుల రంగంలో ఇదొక కీలక మార్పు అనే చెప్పాలి.