33.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని ప్రియాంక

మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని ప్రియాంక

- Advertisement -

సికింద్రాబాద్ / రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులోని యువకులు కారుతో క్రూరంగా ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని (డెర్మటాలజీ పీజీ ఫస్టియర్) డాక్టర్ ప్రియాంక (Dr. Priyanka) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వైద్యులు ఆదివారం ధ్రువీకరించారు.

కొద్దిరోజుల్లో వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాల్సిన యువతి ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబంలో, వైద్య విద్యార్థుల్లో తీరని శోకం అలముకుంది.

అసలేం జరిగింది?

ఆగస్టు 3న రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఈ దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్‌లను మాల్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై దాడి చేసి వేగంగా కారులో పారిపోయే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో థియేటర్ బయట స్కూటీపై వెళ్తున్న ప్రియాంక, ఆమె స్నేహితుడిని నిందితులు తమ కారుతో కావాలనే మూడుసార్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆగస్టు 5న ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల బృందం ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, తలకు కాంప్లెక్స్ గాయాలు కావడంతో బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుని ఆదివారం కన్నుమూశారు.

ప్రియాంక మరణించడంతో పోలీసులు కేసు సెక్షన్లను మార్చనున్నారు.

ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ప్రమాదం కాదని, కావాలని చేసిన క్రిమినల్ దాడి (హత్యాయత్నం) అని నిర్ధారించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రియాంక మృతి చెందడంతో నిందితులపై ఉన్న హత్యాయత్నం కేసును ‘హత్య కేసు’ (Murder Case – BNS Section 103) గా మార్చి విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు.

నిందితులకు ఉరిశిక్ష విధించాలని మృతురాలి తండ్రి వెంకటేష్, తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -