
అమరావతి: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 22వ మహాసభలను జూలై 4, 5, 6 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి ఈ మహాసభలు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని ది వాల్టర్ ఈ వాషిగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరపబోతున్నారు.
ఈ విషయాన్ని తానా అధ్యక్షుడు సతీశ్ వేమన ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసిన సందర్భంగా తెలియజేశారు.
అమెరికాలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ మహాసభలకు అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఇటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లను కూడా ఆహ్వానించినట్లు సతీశ్ వేమన చెప్పారు.
2007 తర్వాత మళ్లీ ఈ 2019లో తానా మహాసభలు వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు మన దేశం నుంచి ఇంకా పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన వివరించారు.
‘తానా’ వేదికపై శ్రీవారి కల్యాణం…
‘తానా’ వేదికపై ఈసారి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం కూడా నిర్వహించాలని నిర్ణయించామని సతీష్ వేమన తెలిపారు. తాళ్లపాకలో 600 మంది కళాకారులతో నిర్వహించిన అన్నమయ్య కార్యక్రమం విజయవంతమైందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని నగరాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
50కి పైగా దేశాల నుంచి ప్రవాస తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరుకానున్న ‘తానా’ మహాసభలకు ప్రముఖ నటీనటులు, కవులు, కళాకారులు హాజరుకానున్నారు. ఈ మహాసభల విజయవంతానికి400 మందికిపైగా వాలంటీర్లు శ్రమిస్తున్నారు.
చంద్రబాబును కలిసిన ‘తానా’ ప్రతినిధులు…
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడ్ని ఆహ్వానించేందుకు ఇటీవల తానా అధ్యక్షుడు వేమన సతీష్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రతినిధి కోమటి జయరాం, తానా ఇండియా కోఆర్డినేటర్ గారపాటి ప్రసాద్‌లు సంయుక్తంగా ఆయన్ని కలిశారు.
జులై 4 నుండి 6 వరకు వాషింగ్టన్ డీసీలో జరగబోయే తానా 22వ మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన చంద్రబాబు తప్పకుండా హాజరవుతారనని తెలిపారు. ఈ సందర్భంగా 2007లో జరిగిన ‘తానా’ మహాసభలకు తాను హాజరైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.








