వాషింగ్టన్: ఒకవైపు కరోనా విలయంతో ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న అమెరికాలోని ప్రవాస భారతీయులు.. తాజాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం తలెత్తిన నిరసనలు, విధ్వంసం, లూటీలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఈ అల్లర్లలో అక్కడి మన భారతీయుల దుకాణాలు, రెస్టారెంట్లు కూడా ధ్వంసమయ్యాయి. వీటిలో గాంధీ మహల్ రెస్టారెంట్, హండీ రెస్టారెంట్, ఇంటర్నేషనల్ బజార్, అనన్య డ్యాన్స్ థియేటర్ లాంటివి ఉన్నాయి.
అమెరికాలోని మినియాపోలిస్‌లో భారతీయులకు చెందిన దుకాణాలు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ సుమారు 308 దుకాణాలు, రెస్టారెంట్లు విధ్వంసానికి గురయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది.
అయితే వీటిలో తెలుగు వారికి సంబంధించినవేవీ లేవని అక్కడి తెలుగు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
వరంగల్‌కు చెందిన ప్రణీత ఒక ఫొటోను ఫేస్బుక్లో జతచేస్తూ.. తనతోపాటు కాలేజీలో చదువుకున్న స్నేహితురాలి కుటుంబానికి మినియాపోలిస్‌లో ఉన్న కార్ల షోరూం ఈ నిరసనల్లో పూర్తిగా కాలిపోయిందన్నారు.
ఇప్పటికే కరోనా వల్ల బిజినెస్‌లు అతంతమాత్రంగా ఉన్నాయని.. ఇప్పుడు ఫ్లాయిడ్ నిరసనకారుల దెబ్బతో దివాలా తీసే పరిస్థితి తలెత్తిందని పలువురు ఎన్నారైలు వాపోతున్నారు.
‘‘తెలుగు వారు క్షేమమే..’’
అటు కరోనా.. ఇటు నిరసనలతో భారతీయులు చాలా ఇబ్బంది పడుతున్నట్లు ‘మాటా’ వ్యవస్థాపకుడు నిరంజన్ అల్లంనేని తెలిపారు. నిరసనలకు కేంద్రమైన మినియాపోలిస్‌లో జరిగిన అల్లర్లలో భారతీయులకు చెందిన పలు దుకాణాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
అయితే డౌన్టౌన్లో తెలుగు వారు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం అందుతోందని, వారి క్షేమ సమాచారం తాము ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆయన వివరించారు.