హెచ్-1బీ వీసాపై భారతీయ ఐటీ నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్…

Donald Trump Signs executive order to restrict H1B Visa Use
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలపై కన్నేసిన భారతీయ ఐటీ నిపుణులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మళ్లీ షాక్ ఇచ్చారు. హెచ్-1బీ వీసాలో ఉన్న విదేశీయులకు ఉద్యోగాలు లభించకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సోమవారం ట్రంప్ సంతకం చేశారు.  ఇది అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే భారతీయ ఐటీ నిపుణలకు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ ఉత్తర్వు ప్రకారం ఫెడరల్ ఏజెన్సీలు.. విదేశీ కార్మికుల ఉద్యోగ నియామకాల విషయంలో.. అందులోనూ మరీ ముఖ్యంగా హెచ్-1బీ వీసాలో ఉన్న వారిని నియమించకుండా ఈ కొత్త ఉత్తర్వు అడ్డుకుంటుంది.

కరోనా వైరస్ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీనిని అధిగమించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అధ్యక్షుడు ట్రంప్ అన్వేషిస్తున్నారు.

మరోవైపు అధ్యక్ష ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికన్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ శతధా ప్రయత్నిస్తున్నారు. 

అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం ఉన్న విదేశీ వలసదారులకు మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు వీలుగా గత జూన్ నెలలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 

హెచ్-1బీ వీసాలతోపాటు ఇతర విదేశీ వీసాలను 2020 చివరి దాక రద్దు చేసి భారతీయ ఐటీ నిపుణుల ఆశలను నీరుగార్చారు. అంతటితో ట్రంప్ ఆ విషయం వదిలిపెట్టలేదు.

ముఖ్యంగా ఆయన దృష్టి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాలపైనే ఉంది. తాజాగా హెచ్-1బీ వీసాలో ఉన్న విదేశీయులకు తమ దేశంలో ఉద్యోగాలు లభించకుండా ఉత్తర్వు జారీ చేశారు.

సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే ముందు శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ట్రంప్ మాట్లాడారు.

తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పని చేసే అమెరికన్లను ఉద్యోగాల్లోంచి తొలగించే నిర్ణయాలు, చర్యలను తన పాలనలో సహించేది లేదన్నారు.

‘‘ఫెడరల్ ప్రభుత్వం అమెరికన్లను మాత్రమే ఉద్యోగాల్లో నియమించుకునేలా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నాను..’’ అంటూ ట్రంప్ వెల్లడించారు. 

- Advertisement -