వాషింగ్టన్: అమెరికాలోని పాఠశాలల్లో గన్ ఫైర్ కల్చర్ అధికమవుతోంది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో వారం క్రితం జరిగిన కాల్పుల ఘటన మరువకముందే మళ్లీ మంగళవారం న్యూ ఓర్లీన్స్‌లోని మరో పాఠశాలలో గన్ ఫైర్ జరిగింది.
న్యూ ఓర్లీన్స్‌లోని జేవియర్ యూనివర్సిటీ ప్రాంగణంలో మోరిస్ జెఫ్ హై స్కూల్ విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుతుండగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం అందరిలోనూ తీవ్ర ఆందోళన కలిగించింది.
ఈ నెల 24న టెక్సాస్‌లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు కాల్పులకు దిగగా ఈ ఘటనలో 19 మంది చిన్నారులు, ఓ టీచర్ సహా మొత్తం 21 మంది మృత్యువాత పడ్డారు.
మెక్సికో సరిహద్దులోని ఉవాల్డేలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. అమెరికాలో గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన ఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ సైతం వ్యాఖ్యానించారు.
తాజాగా మోరిస్ జెఫ్ హైస్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒక మహిళ మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అప్పటి వరకు స్నాతకోత్సవంలో పాల్గొన్న వీరు వెలుపలికి రాగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కాల్పుల ఘటనను ధ్రువీకరించిన లూసియానా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని కూడా అదుపులోనికి తీసుకున్నట్లు ప్రకటించారు.