న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది.
జూన్ 8వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ ఆ సమన్లలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా స్వయంగా మీడియాకు వెల్లడించారు.
సోనియా, రాహుల్ తదితరులు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను ఆయాచితంగా పొందారంటూ గతంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు చేయగా, ఈ మేరకు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి పడ్డ రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని, కేవలం రూ.50 లక్షల చెల్లింపుతోనే వారు ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని సుబ్రమణ్య స్వామి తన ఆరోపణల్లో పేర్కొన్నారు.
దీనిపై సోనియా, రాహుల్ గాంధీల సహా ఏడుగురు వ్యక్తులపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సుబ్రమణ్య స్వామి కేసు దాఖలు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి.. అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్‌లను పిలిచి ప్రశ్నించింది.
ఈ కేసులో తాజాగా సోనియా, రాహుల్ గాంధీల స్టేట్‌మెంట్‌లను కూడా రికార్డు చేసేందుకు.. వారికి సమన్లు జారీ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.