విజయవాడ: కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నారైలను స్వదేశం చేర్చే కార్యక్రమం ‘వందే భారత్ మిషన్-2’ ఈ నెల 16 నుంచి మొదలైంది.
ఇందులో భాగంగా ఆదివారం చికాగో నుంచి 31 మంది తెలుగు ఎన్నారైలు ఏపీకి చేరుకున్నారు. చికాగో నుంచి తొలుత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఎన్నారైలు అక్కడ్నించి ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు చేరుకున్నారు.
వీరికి విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని సొంత జిల్లాలలోని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.
మూడు నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది.
అమెరికాలో ఇప్పటి వరకు 15 లక్షల మంది కరోనా బారినపడగా.. 90 వేల మందికిపైగా మరణించారు. అయితే ఆర్థిక వ్యవస్థకు ముంచుకురానున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి.
భారత ప్రభుత్వం కూడా లాక్డౌన్ నిబంధనలను సడలించడమేకాక.. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి చేర్చేందుకు ‘వందే భారత్ మిషన్’ ప్రారంభించింది.
ఈ మిషన్ తొలి దశలో.. విదేశాల్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయులు భారత్ చేరుకున్నారు. తాజాగా ‘వందే భారత్ మిషన్’ రెండో దశలో భాగంగా ఇన్నాళ్లూ చికాగోలో చిక్కుకుపోయిన 31 మంది తెలుగువారిని క్షేమంగా వారి స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చేర్చారు.