MLC Kavitha: తీహార్ జైలు నుంచి కవిత విడుదల.. కుటుంబ సభ్యులను చూసి తీవ్ర భావోద్వేగం

- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేయడంతో.. కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు.

సుప్రీం ధర్మాసనం సూచనల మేరకు ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు బాండ్లను ఆమె భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఏంపీ రవిచంద్ర ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించారు.

చదవండి: బిగ్ బ్రేకింగ్: కవితకు ఊరట.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు

దీంతో రౌస్ అవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 15న అరెస్ట్ అయి గత అయిదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత మంగళవారం రాత్రి విడుదలయ్యారు.

కవిత జైలు నుంచి విడుదల అవుతున్నారని తెలియగానే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. రాత్రి 9.11 గంటల సమయంలో కవిత బిగించిన పిడికిలిని గాల్లో ఊపుతూ జైలు నుంచి బయటికి అడుగు పెట్టారు.

అప్పటికే అక్కడ ఆమె భర్త అనిల్ కుమార్, కుమారుడు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తదితరులు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు.

భర్త, కుమారుడు, సోదరుడిని చూడగానే కవిత వారిని ఆలింగనం చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారితోపాటు హరీశ్‌రావు, ఎంపీ సురేష్ రెడ్డి ఆమెను ఓదార్చారు.

కవిత విడుదలవబోతున్నారని తెలియగానే బీఆర్ఎస్ ఇతర నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి డప్పుల చప్పుడుతో ఆమెకు స్వాగతం పలికారు. ఆ తరువాత కవిత చమర్చిన కళ్లతో జై తెలంగాణ నినాదం చేస్తూ వాహనం ఎక్కారు.

నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు: కవిత

ఈ సందర్భంగా కవిత మీడియా ప్రతినిధులతో మాట్లడుతూ.. తాను కేసీఆర్ బిడ్డనని.. తప్పు చేసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. నేను మంచిదాన్ని, మొండిదాన్ని కూడా.. ఇప్పుడు నన్ను అనవసరంగా జైలులో పెట్టి జగమొండిని చేశారని పేర్కొన్నారు.

తాను 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని చెప్పారు. కుటుంబానికి దూరంగా అయిదున్నర నెలలు జైలులో ఉండడం ఎంతో ఇబ్బందికరం అని వ్యాఖ్యానించారు. కష్ట సమయంలో తన కుటుంబానికి తోడుగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

తనను , తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని, అందుకు తగిన సమయం కూడా వస్తుందని హెచ్చరించారు. ఇకమీదట చట్టబద్ధంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని, మరింత నిబద్ధతతో క్షేత్ర స్థాయిలో పనిచేస్తామని కవిత చెప్పారు.

 

- Advertisement -