
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రస్తుత మంత్రి వర్గం రద్దు చేసినట్లు సమాచారం. ఇక మీదట పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించినట్లు తెలుస్తోంది.
అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ (ఎస్ఈబీ) రద్దుకు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు కూడా ఏపీ క్యాబినెట్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకా.. సాగునీటి ఎన్నికల నిర్వహణకు అంగీకారం, పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటో తొలగింపు, పోలవరం ఎడమ కాలవు పనుల పునరుద్ధరణకు ఆమోదం వంటి నిర్ణయాలు ఏపీ మంత్రి వర్గం తీసుకున్నట్లు సమాచారం.
అంతేకాదు, పోలవరం ఎడమ కాలవు పనుల పునరుద్ధరణ పనుల్లో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ సంస్థ కొనసాగింపునకు కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైనది.. వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతను కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదించినట్లు సమాచారం.








