22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ బిగ్ బ్రేకింగ్: కవితకు ఊరట.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు

బిగ్ బ్రేకింగ్: కవితకు ఊరట.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ మంజూరు

- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మంగళవారం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిగింది. అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఆ కోర్టు ఇచ్చిన తీర్పును తాము కొట్టివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని ప్రకటిస్తూ.. కవిత ఒక్కో కేసులో రూ.10 లక్షల చొప్పున పూచీకత్తు సమర్పించాలని,  తన పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని, సాక్ష్యాలను ధ్వంసం చేయరాదని పేర్కొంది.

కేసు విచారణలో అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలనే షరతులు విధిస్తూ తీహార్ జైలునుంచి ఆమె విడుదలకు ఆదేశాలు జారీ చేసింది.

కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది: ముకుల్ రోహత్గీ

మంగళవారం ఉదయం కవిత బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలుకాగానే.. కవిత తరపున దామా శేషాద్రినాయుడు, విక్రమ్ చౌధరిలతో కలిసి మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు.

ఈడీ పెట్టిన కేసులో ఇప్పటికే విచారణ పూర్తయిందని, అలాగే సీబీఐ పెట్టిన మరో కేసులో కూడా చార్జిషీట్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి ఆయన తీసుకొచ్చారు. రెండు కేసుల్లోనూ దర్యాప్తు పూర్తయినందున కవితను ఇంకా కస్టడీలో కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మనీష్ సిసోడియా కేసులో మాదిరిగానే ఈ కేసులోనూ 493 మంది సాక్షులను విచారించాల్సి ఉందని, 50 వేలకు పైగా దస్తావేజులను పరిశీలించాల్సి ఉందని, ఇదంతా పూర్తి కావడానికి చాలా కాలం పడుతుందని కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు.

అంతేకాదు.. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు కవిత నుంచి ఎలాంటి నేరపూరిత ఆర్జిత సొమ్మును స్వాధీనం చేసుకోలేదన్న విషయాన్ని కూడా న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ మహిళ కనుక పీఎంఎల్‌ఏ చట్టంలోకి సెక్షన్ 45(1) నిబంధన ప్రకారం కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని విన్నవించారు.

‘‘సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లుగానే భావించాలి..’’ 

అయితే కవిత తరపు న్యాయవాదుల వాదనను ఈడీ, సీబీఐ తరపు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) ఎస్‌.వి.రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఇప్పటి వరకు వివిధ సాక్షులు, సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా చూస్తే.. కవితే కింగ్‌పిన్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సౌత్ లాబీ మధ్య ఒప్పందం కుదర్చడంలో ఆమె కీలకపాత్ర పోషించినట్లు స్పష్టమవుతోందన్నారు. ఇక నేరపూరిత ఆర్జన విషయానికొస్తే.. ఆ డబ్బు ఆమె ద్వారానో లేదంటే ఆమె సూచనల ప్రకారమో మరోచోటికి తరలిపోయిందన్నారు.

ఈ కేసులో కవిత పాత్రను.. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద మాత్రమే కాక, సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసిన వాంగ్మూలాలు కూడా స్పష్టం చేస్తున్నాయని రాజు తెలిపారు.

పైగా ఆమె ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసే ఉద్దేశంతో తన  మొబైల్ ఫోన్లను ఫార్మేట్ కూడా చేశారని, అలాగే ఈ కేసులో నిందితుడైన అరుణ్ పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడం వెనుక కూడా కవిత ఒత్తిడే ఉందని ఆరోపించారు.

సాక్ష్యాలను రూపుమాపేందుకు, సాక్షులను ప్రభావితం చేసే చర్యల్లో కవిత పాలుపంచుకున్నందునే పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 45(1) కింద బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి సరైన నిర్ణయమే తీసుకున్నారని.. ఈ ఆధారాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని కవిత ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నట్లుగానే అత్యున్నత న్యాయస్థానం కూడా భావించాలని వాదించారు.

ఇంకా పిటిషనర్ అవసరం ఏముంది?: జస్టిస్ బీఆర్ గవాయి

ఈ దశలో సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ గవాయి జోక్యం చేసుకుంటూ.. తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో దర్యాప్తు పూర్తయిన విషయాన్ని గమనించామని, ఇక మీదట దర్యాప్తు సంస్థలకు పిటిషనర్ కస్టడీ అవసరం లేదని భావిస్తున్నామన్నారు.

ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించడంతోపాటు, 50 వేలకుపైగా దస్తావేజులను పరిశీలించాల్సి ఉంది. కాబట్టి సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తికావడం అసాధ్యమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 45(1)లోని నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని, అండర్ ట్రయల్ కస్టడీ ప్రక్రియ శిక్షగా మారకూడదని అభిప్రాయపడింది.

చట్టం ఒక కేటగిరీ పరిధిలోకి వచ్చే నిందితులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నప్పుడు, వాటికి తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిన పరిస్థితుల్లో న్యాయస్థానాలు కూడా స్పష్టమైన కారణాలు సూచించాలని తెలిపింది.

ఈ కేసులో కవితకు సదరు వెసులుబాట్లను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఇలాంటి కారణాలేవీ పేర్కొనలేదని, కాబట్టి సెక్షన్ 45(1) కింద కవితకు ఉన్న ప్రయోజనాలను తిరిస్కరించడంలో హైకోర్టు ధర్మాసనం పూర్తిగి తప్పటడుగు వేసినట్లు భావిస్తున్నామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అందువల్లనే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము కొట్టివేస్తూ ఈ కేసులో కవితకు బెయిలు ఇస్తున్నామని, ఒక్కో కేసులో ఆమె నుంచి రూ.10 లక్షల పూచీకత్తును తీసుకొని ఆమెను విడుదల చేయాలని ఆదేశిస్తున్నామంటూ సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

- Advertisement -