ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో టీవీ ప్లస్ (Jio Tv+) సేవలను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది.
జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ఇప్పటి వరకు ఈ సేవలు సెట్ టాప్ బాక్స్ ద్వారా లభించేవి. అయితే ఇప్పుడు జియో టీవీ ప్లస్ సేవలను దాదాపు అన్ని స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్స్‌పైకి తీసుకొచ్చింది.
చదవండి: Spurthy Reddy: జలమండలి మేనేజర్ అరెస్ట్! రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా…
అంటే.. ఇక మీదట జియో టీవీ ప్లస్ కంటెంట్‌ను వినియోగదారులు ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీలోనూ వీక్షించవచ్చు. ఇకపై తమ వినియోగదారులు సింగిల్ లాగిన్‌తో 800 డిజిటల్ చానెళ్లను వీక్షించవచ్చని జియో తాజాగా ఒక ప్రకటనలో తెలియజేసింది.
అయితే శాంసంగ్ స్మార్ట్ టీవీ వినియోగదారులు మాత్రం వారి స్మార్ట్ టీవీలో జియో టీవీ ప్లస్ యాప్‌ను యాక్సెస్ చేయలేరు. వీరు సెట్ టాప్ బాక్స్ తప్పక ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఎల్‌జి స్మార్ట్ టీవీల్లో జియో టీవీ ప్లస్ కంటెంట్ వీక్షించే సదుపాయం త్వరలోనే కల్పిచనున్నట్లు జియో పేర్కొంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి జియో టీవీ ప్లస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. లాగిన్ అవడం ద్వారా వినియోగదారులు జియో టీవీ ప్లస్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.
అయితే అందరూ కాదు..
జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులైతే అన్ని ప్లాన్ల పైనా జియో టీవీ ప్లస్ కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు.
జియో ఫైబర్ వినియోగదారులైతే.. పోస్ట్ పెయిడ్ రూ.599, రూ.899 ఆ పై ప్లాన్లు తీసుకున్న వారు, ప్రీ పెయిడ్ రూ.999 లేదా ఆ పైన ప్లాన్లు తీసుకున్న వారు జియో టీవీ ప్లస్ కంటెంట్‌ను చూడొచ్చు.