‘పసిడి’ పైపైకి.. బంగారం బాటలోనే ‘వెండి’… ఇప్పుడు 10 గ్రాముల ధర ఎంతంటే…

- Advertisement -

ముంబై: బంగారు ఆభరణాలు కొనాలని భావిస్తున్న వారికి ఇది చేదు వార్తే. ఎందుకంటే.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు సోమవారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడంతో ఆ ప్రభావం మన దేశీయ బులియన్ మార్కెట్‌పై కూడా పడింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది.

సోమవారం ఒక్కరోజే బంగారం ధర రూ.350 పైగా పెరిగింది. న్యూఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,208 నుంచి రూ.47,573 కు పెరిగింది.

అలాగే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఒక్కరోజులో రూ.300 పైన పెరిగి రూ.44,402 వద్ద నిలిచింది.

అయితే, హైదరాబాద్‌లో మాత్రం బంగారం ధరలు స్థిరంగానే ఉండడం ఇక్కడి వారికి కాస్త ఊరట కలిగించే అంశం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర సోమవారం రూ.44,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది.

బంగారం బాటలోనే… వెండి ధర

సోమవారం కేజీ వెండి ధర సుమారు రూ.2000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,116కు చేరింది. అంతకుముందు రోజు వెండి ధర కిలో రూ.63158గా ఉంది. ఒక్కరోజులోనే రూ.2 వేలు పెరిగింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ల ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల బంగారం ధరలపై ప్రభావం చూపుతూ ఉంటాయి.

- Advertisement -