
హైదరాబాద్: తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా, ఆహార, నిత్యావసర వస్తువుల డెలివరీ సేవలపై ఆధారపడే ప్రయాణికులు, వినియోగదారులకు తీవ్ర విఘాతం కలగనుంది. ఆగస్టు 8 (శనివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido) వంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలతో పాటు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), జెప్టో (Zepto) వంటి డెలివరీ యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు గిగ్ వర్కర్ల ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ (JAC) అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి గిగ్ ఆఫీస్‌లో సమావేశమైన 16 ప్రధాన డ్రైవర్, డెలివరీ బాయ్స్ సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఈ సమ్మె నిర్ణయాన్ని తీసుకున్నారు.
గిగ్ వర్కర్ల ప్రధాన డిమాండ్లు ఇవే!
తమ సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత సంస్థలకు పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రధాన డిమాండ్లు:
ప్రత్యేక సంక్షేమ బోర్డు: గిగ్ వర్కర్ల సామాజిక, ఆర్థిక భద్రత కోసం ప్రత్యేకంగా ‘సంక్షేమ బోర్డు’ ఏర్పాటు చేసి ‘తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ రూల్స్’ను వెంటనే అమలు చేయాలి.
న్యాయమైన కనీస ఛార్జీలు: యాప్ ఆధారిత రవాణా సేవలకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలతో పాటు కిలోమీటర్‌కు, నిమిషానికి నిర్దిష్ట ఛార్జీలను ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేయాలి.
స్థిరమైన ఆదాయం: కార్పొరేట్ యాప్ సంస్థలు విధిస్తున్న అన్యాయమైన కమీషన్లు, ఛార్జీల తగ్గింపు వల్ల తమ ఆదాయం పడిపోయిందని, డ్రైవర్లు, డెలివరీ సిబ్బందికి స్థిరమైన ఉపాధి భద్రత కల్పించాలి.
రేవంత్ రెడ్డి హామీలు ఏమైనట్లు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమై ఇచ్చిన హామీలను జేఏసీ నాయకులు గుర్తుచేశారు. గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు, ప్రైవేట్ యాప్‌ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉమ్మడి రవాణా యాప్‌ను అందుబాటులోకి తెస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ నెలలు గడుస్తున్నా అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
ప్రయాణికులు, ఐటీ ఉద్యోగులకు తిప్పలు!
రాష్ట్రవ్యాప్తంగా 16 సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలపడంతో శనివారం నుంచి సేవలు ముగిసిపోనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, రవాణా వ్యవస్థపై ఆధారపడే ప్రయాణికులు,ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై ఆధారపడే వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. తమ పోరాటానికి ప్రజలు, వినియోగదారులు సహకరించాలని గిగ్ వర్కర్ల జేఏసీ విజ్ఞప్తి చేసింది.








