ఢిల్లీ లిక్కర్ కేసు: ఈడీ నేటి విచారణకు కల్వకుంట్ల కవిత ‘డుమ్మా’..! అరెస్టు భయమే కారణమా?

- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలకు మరోసారి వేడెక్కాయి. లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు రెండోసారి హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈడీ ముందు హాజరవుతానని ముందే ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత… ఈ రోజు హాజరుకాలేదు. అనారోగ్య కారణాలతో ఈడీ విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి మెయిల్‌ పంపింది. దీనిపై ఈడీ నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు.

నిజానికి ఉదయం 11 గంటలకు కవిత.. ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఉదయం నుంచి ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈడీ ముందు హాజరవడానికి ముందు మీడియాతో మాట్లాడతానని చెప్పిన ఎమ్మెల్సీ కవిత.. ఉదయం నుంచి లీగల్‌ ప్రతినిధులతో విస్త్రుతంగా చర్చలు జరిపారు.

ఈడీ ముందు హాజరైతే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని లీగల్‌ ఎక్స్‌ఫర్ట్స్‌ సూచనలు సలహాలు తీసుకున్నారు. చివరకు ఈడీ ముందు హాజరుకాకూడదన్న నిర్ణయానికి వచ్చారు.

ఢిల్లీకి మంత్రుల క్యూ..

మరోవైపు కవితకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎంపీలు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, భారత్‌ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు.

మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తున్నారు. విచారణ తర్వాత కవితను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి.

అదే జరిగితే ఢిల్లీ వేదికగా దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈడీ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు ముట్టడించే అవకాశం ఉండడంతో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.

సుదీర్ఘంగా విచారణ..

కాగా ఈనెల 11న మొదటిసారి ఈడీ ముందు కవిత హాజరుకాగా, ఆమెను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 9 గంటలపాటు విచారణ సాగింది. కవిత మొబైల్‌ ఫోన్‌ ను కూడా ఈడీ సీజ్‌ చేసింది.

16న మరోసారి హాజరుకావాలని నోటీసులిచ్చింది. దానికి అనుగుణంగా ఈ రోజు కవిత విచారణకు హాజరుకావాల్సి ఉన్నా దానికి డుమ్మా కొట్టారు.

- Advertisement -