న్యూఢిల్లీ : అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ -IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ దేశ రాజధాని న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పోటీలను ప్రారంభించారు.
బుధవారం జరిగిన ఆరంభ వేడుకల్లో 65 దేశాలకు చెందిన ఆటగాళ్లు మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. సంపన్నమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మార్చి 26 వరకు జరిగే ఈ పోటీల్లో టాప్ బాక్సర్లందరూ బరిలోకి దిగుతున్నారు. 12 వెయిట్ కేటగిరీలలో పోటీపడుతున్నారు.
నిఖత్, లవ్లీనాపై ఆశలు..
భారత్ తరఫున స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై మువ్వన్నెల జెండాతో అలరించారు. మూడోసారి భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 300 మందికి పైగా బాక్సర్లు పోటీపడుతున్నారు.
ఆతిథ్య భారత్ తరఫున 12 మంది బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, ఒలింపిక్ విజేత లవ్లీనా బొర్గోహైపై భారీ అంచనాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిఖత్ 50 కేజీల విభాగంలో, లవ్లీనా 75కిలోల విభాగంలో పోటీపడుతున్నారు.
దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేత మేరీకోమ్ గాయం కారణంగా ఈసారి ఈ మెగాటోర్నీకి దూరమైంది.
నిఖత్ పంచ్ పవర్
తన బరువు కేటగిరీ మార్చుకున్న తర్వాత నిఖత్ జరీనా… తొలి బౌట్‌లో అజార్‌బైజాన్‌కు చెందిన ఇస్మాయిలోవా అనకీనమ్‌తో తలపడుతుంది.
టర్కీ వేదికగా గతేడాది జరిగిన ప్రపంచ టోర్నీలో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ మరోమారు అలాంటి మేటి ప్రదర్శన ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.
తొలి రౌండ్‌లో సునాయాసంగా గెలిచే చాన్స్ ఉన్న నిఖత్‌కు ముందుముందు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. మరోవైపు లవ్లీనా బొర్గోహైతో పాటు సవిటీ బూరకు తొలి రౌండ్‌లో బై లభించింది.
20 కోట్ల ప్రైజ్‌మనీ
మెగాటోర్నీలో మొత్తం ప్రైజ్‌మనీ 20 కోట్లుగా ప్రకటించారు. మొత్తం 12 విభాగాల్లో బాక్సర్లు పోటీపడుతారు. స్వర్ణ పతక విజేతకు 82 లక్షలు, రజతానికి 41 లక్షలు, కాంస్యానికి 20 లక్షల నగదు బహుమతి దక్కనుంది.