భారత బాక్సర్ సుమిత్ సాంగ్వాన్‌పై ఏడాది నిషేధం

- Advertisement -

న్యూఢిల్లీ: భారత బాక్సర్ సుమిత్ సాంగ్వాన్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) వేటేసింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న ‘ఎసిటజోలమైడ్’ను సుమిత్ తీసుకున్నట్టు తేలింది.

ఈ ఏడాది అక్టోబరులో అతడి నమూనాలను పరీక్షించిన నాడా నిషేధిత డ్రగ్‌ను వాడినట్టు తేలడంతో ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ విషయాన్ని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు.

‘ఎలైట్‌మెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌’లో పాల్గొన్నప్పుడు అక్టోబరు 10న సుమిత్ నమూనాలను సేకరించినట్టు నవీన్ అగర్వాల్ తెలిపారు. డోప్ పరీక్షల్లో ‘ఎసిటజోలమైడ్’అనే ఉత్ప్రేరకాన్ని వాడినట్టు తేలిందన్నారు. దీంతో నాడా నిబంధనల ప్రకారం అతడిపై ఏడాదిపాటు నిషేధం విధించినట్టు వివరించారు.

సుమిత్ వివరణ ఇలా…

ఈ సందర్భంగా సుమిత్‌ను వివరణ కోరగా, కంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు వైద్యుడు రాసిన మందుల్లో తప్పు జరిగి ఉంటుందని సుమిత్ తమకు చెప్పినట్టు వివరించారు. నిషేధిత ఉత్ప్రేరకాలను క్రీడాకారులు తీసుకోకుండగా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కాగా, తాజా వేటుతో సుమిత్ 91 కేజీల విభాగంలో ఒలింపిక్స్ అర్హత పోటీలకు నిర్వహించే ట్రయల్స్‌కు సుమిత్ దూరమయ్యాడు. 2017లో నిర్వహించిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సుమిత్ రజత పతకం సాధించాడు.

- Advertisement -