
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై మండిపడుతున్న అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ తన ఆలోచనను బయటపెట్టినప్పటి నుంచి అమరావతి ప్రాంతంలోని రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వీరు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు మద్దతు తెలిపారు. రాజధాని అభివృద్ధికి భూములిచ్చిన రైతులు పిల్లాపాపలతో రోడ్లపైకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.
తాజాగా గొల్లపూడిలో రైతులకు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమ రోడ్డుపై బైఠాయించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులతో కలిసి నినాదాలు చేశారు. రైతులు, మహిళలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ఈ ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.








