22.6 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ముగిసిన కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష.. జగన్‌పై నిప్పులు

ముగిసిన కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష.. జగన్‌పై నిప్పులు

- Advertisement -

అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌన దీక్ష ముగిసింది. దీక్ష ముగించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్‌పై నిప్పులు చెరిగారు.

రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేసిందని, ఎన్నో నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక రాకముందే జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేశారని విమర్శలు గుప్పించారు.

‘‘అధికారంలోకి వస్తూనే కుట్రలకు తెర..’’

కేబినెట్‌ నిర్ణయం రాకముందే విశాఖలో వైసీపీ ఎంపీ పండగ చేసుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తూనే కుట్రలకు తెరలేపారని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, రాష్ట్రాన్ని జగన్ తన జాగీరు అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.

జగన్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికను తాము ఎప్పుడూ స్వాగతించలేదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని పేర్కొన్నారు. తాము పాలనా వికేంద్రీకరణకు పూర్తి వ్యతిరేకమని, అభివృద్ది వికేంద్రీకరణకు కాదని కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు.

- Advertisement -