రష్యా: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకుని అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల బాక్సింగ్‌లో ఛాంపియన్ షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి బాక్సర్‌గా నిలిచిన అమిత్ పంగాల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
రష్యాలోని ఏక్తరిన్‌బర్గ్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒలింపిక్ పతక విజేత షాకోబిదిన్ జోరొవ్ చేతిలో 0-5తేడాతో అమిత్ ఓటమి పాలయ్యాడు.
అంతకుముందు రోజైన శుక్రవారం నాడు 52 కిలోల విభాగంలో పంగల్ సెమీఫైనల్లో తలపడ్డాడు. కజకిస్థాన్ భాక్సర్ సకేన్ బిబోస్సినోవ్ తో హోరాహోరీగా తలపడ్డ పంగల్ చివరకు 3-2 తేడాతో విజేతగా నిలిచాడు. దీంతో ఫైనల్ కు అర్హత సాధించాడు.
ఇప్పటివరకు విజేందర్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017)లు కూడా ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకాలను మాత్రమే సాధించారు.
2017 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో కూడా కాంస్య పతకం గెలుచుకున్న అమిత్ పంగాల్.. ఇప్పుడు లభించిన ఈ పతకం అత్యున్నతంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఏడాదికి ముందు భారత్ కాంస్యం పతకం తప్పించి రెండు పతకాలను ఎప్పుడూ సాధించలేదు.
63 కేజీల విభాగంలో…
ఇక 63 కేజీల విభాగంలో పోటీపడిన మనీష్ కౌశిక్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకానికి పరిమితమయ్యాడు. ఈసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బరిలోకి దిగిన 9 దేశాల నుంచి 78 మంది క్రీడాకారులు పోటీ పడినప్పటికీ ఉజ్బెకిస్తాన్ మాత్రమే నలుగురు బాక్సర్లతో ఫైనల్‌కు చేరుకుని టాప్‌లో ఒకటిగా నిలిచింది.