హైదరాబాద్ : బ్యాడ్మింటన్ లో గత దశాబ్దకాలంగా భారత ఆటగాళ్లు జోరు చూపుతున్నారు. అంతకుముందు బ్యాడ్మింటన్ అంటే చైనా, ఇండోనేషియా, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాల పేర్లే వినిపించేది. టైటిల్స్ కూడా ఆయా దేశాలవే. పెద్ద సంఖ్యలో బ్యాడ్మింటన్ టైటిల్స్ చైనా ప్లేయర్ల ఖాతాలో చేరేవి.
గత దశాబ్దకాలంగా పరిస్థితి మారింది. బ్యాడ్మింటన్ లో చైనా ఆధిపత్యం కూలుతూ వస్తోంది. పదేళ్ల కిందటి వరకు కేవలం పాల్గొనడం వరకు మాత్రమే ఉన్న భారత బ్యాడ్మింటన్… గత అయిదారేళ్లుగా పతకాలు సాధించే స్థాయికి చేరింది. ప్రత్యర్థి ఎవరైనా సవాల్ విసరడానికి సిద్ధంగా ఉంది. భారత బ్యాడ్మింటన్ ఎదుగుదల వెనక ఉంది మన హైదరాబాదే.
బ్యాడ్మింటన్ కు కేరాఫ్ గా..
పదేళ్ల క్రితం వరకు పుల్లెల గోపీచంద్, జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప వంటి వేళ్లమీద లెక్కపెట్టే బ్యాడ్మింటన్ ముఖాలు మాత్రమే కనబడేవి. కానీ, ఇప్పుడు అలా కాదు… ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎందరో అంతర్జాతీయ స్థాయికి దూసుకువస్తూ మెడల్స్ సాధిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు హైదరాబాద్ నిలయంగా మారింది. సైనా నెహ్వాల్, పివీ సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, ఎన్ సిక్కి రెడ్డి, ప్రణవ్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, గురుసాయిదత్… ఇలా చాలామంది షట్లర్లు హైదరాబాద్‌కు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హైదరాబాద్ పైనే అందరిచూపు..
బ్యాడ్మింటన్ ఛాంపియన్లను తయారు చేస్తున్న కర్మాగారంగా హైదరాబాద్ ఇపుడు వెలుగొందుతోంది. ఇక్కడ బ్యాడ్మింటన్ మౌలిక సదుపాయాలు పెరిగాయి. అధునాతన సౌకర్యాలున్న అకాడమీలు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి.
దీంతో దేశం మొత్తం చూపు హైదరాబాద్ పై పడింది. వివిధ రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్ లోని బ్యాడ్మింటన్ అకాడమీల్లో శిక్షణ పొందుతూ తమ ఆటకు పదునుపెడుతున్నారు.
గోవర్ధన్ అకాడమీ…
హైదరాబాద్‌లోని బ్యాడ్మింటన్ అకాడమీల్లో ఉప్పల్ విజయపురి కాలనీలోని గోవర్దన్ బ్యాడ్మింటన్ అకాడమీ ఒకటి. ప్రతిభావంతులైన షట్లర్లను ఈ అకాడమీ తయారు చేస్తోంది.బ్యాడ్మింటన్ కోచ్ గా రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న గోవర్ధన్… స్వయంగా అకాడమీని నెలకొల్పి యువ ప్లేయర్లను తీర్చిదిద్దుతున్నారు. పది అధునాతన కోర్టులతో కూడిన ఈ అకాడమీని అంతర్జాతీయ స్థాయికి ధీటుగా 2021 డిసెంబర్ లో నెలకొల్పారు.
20 ఏళ్లకు పైగా కోచింగ్ అనుభవం ఉన్న గోవర్దన్ ఆధ్వర్యంలో అకాడమీ నడుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది సీనియర్ ఆటగాళ్లు, 38 మంది అండర్ -15 ఆటగాళ్లు, 30 మంది బిగినర్స్ ఇక్కడ శిక్షణ పొందుగున్నారు.
పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లను తయారు చేసిన గోవర్ధన్… వీరిని తీర్చిదిద్దుతున్నారు. గోవర్దన్ తో పాటు తొమ్మిది మంది కోచ్‌లు ఉన్నారు. ఉదయం, సాయంత్రం ఆటగాళ్ల ఫిట్ నెస్‌పై దృష్టి పెడుతూ… వారి ఆటను మెరుగుపరుస్తున్నారు. అకాడమీలోని ప్లేయర్లందరూ అక్కడే ఉంటూ శిక్షణ తీసుకుంటున్నారు.
విదేశీ కోచ్ లతో శిక్షణ..
అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఆటగాళ్లకు తర్పీదు ఇవ్వడానికి ఇండోనేషియాకు చెందిన ముగ్గురు కోచ్‌ల సేవలను కూడా ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఇండోనేషియా కోచ్‌లు యయా, సుల్తాన్, జకా పర్యవేక్షణలో ఆటగాళ్లు శిక్షణ కొనసాగిస్తున్నారు.
ఆటగాళ్లలోని లోపాలను సవరిస్తూ, వారి ఆటతీరును మెరుగుపరుస్తున్నారు.దీంతో హయతి దూబే, అదితి,తన్మయ్, అభిలాష, ఆర్ధిక, మన్య అగార్వాల్, అధ్యా జైన్, ఫ్లోరా ఇంజనీర్, వర్షిత్ రెడ్డి, నుపుర్ వాద్వా వంటి యువ తేజాలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు.
చదవండి: పర్వతాలను అధిరోహిస్తున్న హైదరాబాద్ కిడ్ కార్తికేయ