ఆశ్చర్యం: విరాట్‌కి ఈక్వల్‌గా సింధు! లీ నింగ్ సంస్థతో రూ.50 కోట్ల వాణిజ్య ఒప్పందం!!

3:37 pm, Sat, 9 February 19
14
pv sindu competes virat kohli in branding

హైదరాబాద్: మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదనే చెప్పాలి. అలాగే ఆర్జన విషయంలోనూ క్రికెటర్లతో ఇతర క్రీడల ఆటగాళ్లకు పోలికే ఉండదు. అయిదే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు సీన్ మారింది.

ఒక షట్లర్.. అందులోనూ అమ్మాయి.. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఆర్జిస్తోన్న క్రికెటర్ విరాట్ కోహ్లీకి సమాన స్థాయిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ అమ్మాయి ఎవరో కాదు.. హైదరాబాదీ స్టార్ షట్లర్.. పూసర్ల వెంకట సింధు. విరాట్ ఓ సంస్థతో 8 ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే.. సింధు 4 ఏళ్ల కాలానికి రూ.50 కోట్ల ఒప్పందం దక్కించుకుంది. అంటే ఏటా సింధు సంపాదన.. విరాట్ కోహ్లీ సంపాదనకు సమానం అన్నమాట!

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచినప్పట్నించి హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధు.. దేశ వ్యాప్తంగా తిరుగులేని ఆదరణ పొందూ వస్తోంది.
గత రెండున్నరేళ్లలో సింధు ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలతో పాటు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ కూడా సాధించింది. ఒలింపిక్స్‌ తర్వాత సింధు తన ఆటపై మరింత శ్రద్ధ పెట్టి.. నిలకడగా రాణిస్తూ ప్రపంచ అగ్రశ్రేణి షట్లర్లలో ఒకరిగా కొనసాగుతోంది. అలాగే తన బ్రాండ్‌ వాల్యూను కూడా సింధు బాగా పెంచుకుంది. ఎన్నో వాణిజ్య సంస్థలతో ఒప్పందాలు కదుర్చుకోవడమేకాక.. అనేక వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తోంది.

విరాట్ కోహ్లీకి సమానంగా…

తాజాగా క్రికెటర్ విరాట్ కోహ్లీకి సమానంగా ఓ భారీ వాణిజ్య ఒప్పదం కుదుర్చుకుని అందర్నీ అబ్బురపరిచింది. చైనాకు చెందిన క్రీడా పరికరాల సంస్థ లీ నింగ్… షట్లర్ సింధుతో 4 ఏళ్ల కాలానికి రూ.50 కోట్ల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ప్రపంచంలోనే ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటి.

గత ఏడాది సింధు ప్రపంచంలోనే అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న ఏడో క్రీడాకారిణిగా ఫోర్ట్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే 2016లో యోనెక్స్‌ సంస్థ ఏడాదికి రూ.3.5 కోట్ల చొప్పున చెల్లించేలా 3 ఏళ్ల కాల వ్యవధికి సింధుతో ఒప్పందం కుదుర్చుకోగా.. తాజాగా లీ నింగ్‌ సంస్థ 4 ఏళ్లకు ఏకంగా రూ.50 కోట్లు చెల్లించబోతోదంటే.. సింధు తన ఆటతీరును మెరుగుపరుచుకుంటూ ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇతర క్రీడాకారులతోనూ…

చైనాకు చెందిన క్రీడా పరికరాల సంస్థ లీ నింగ్… షట్లర్ సింధుతో మాత్రమేకాక పురుష బ్యాడ్మింటన్ క్రీడాకారులతోనూ పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవలే మరో హైదరాబాదీ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌తో ఇదే సంస్థ రూ.35 కోట్లతో ఒప్పందం చేసుకుంది. అలాగే పారుపల్లి కశ్యప్‌‌తో రెండేళ్ల కాలానికి రూ.8 కోట్లు, సుమీత్‌ రెడ్డి-మను అత్రి జోడీకి తలో రూ.4 కోట్లు చెల్లించేలా లీ నింగ్‌ సంస్థ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.

దీన్ని బట్టి చూస్తుంటే భారత్‌లో కేవలం క్రికెట్‌కే కాదు.. బ్యాడ్మింటన్ క్రీడకు కూడా క్రేజ్ ఉందని అర్థమవుతోంది కదూ? మరి ఇందుకు కారణమైన పీవీ సింధును అందరూ అభినందించి తీరాల్సిందే!