సంచలనం: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజయం!

bwf-world-tour-finals-pv-sindhu
- Advertisement -

bwf-world-tour-finals-pv-sindhu

బీజింగ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌‌‌లో విజేతగా నిలిచింది. ఫైనల్స్‌‌లో బలమైన ప్రత్యర్థి అయిన జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహరాతో తలపడిన సింధు రెండు వరుస సెట్లలో మ్యాచ్ ని గెలిచింది.

ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో ఒకుహరాను మన తెలుగు తేజం మట్టికరిపించింది. 21-19, 21-16 సెట్ల తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు గత మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ఒకుహారాపై.. సింధు ప్రతీకారం తీర్చుకుంది.

వరుసగా మూడోసారి ప్రపంచ టూర్ ఫైనల్స్ ఆడిన పీవీ సింధు అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్లింది. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పెద్ద టోర్నమెంట్‌లలో చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి ఓటమి చవిచూసింది.

2017, 2018 సంవత్సరాలలో వరుస ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ సింధు రన్నరప్‌గా నిలిచింది. గత ఏడాది ప్రపంచ టూర్‌ ఫైనల్లోనూ ఓటమి తప్పలేదు. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల్లోనూ సింధుకు దక్కింది రజతమే.


తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన ఆట తీరుతో…

జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరతో గతంలో 12 మ్యాచ్‌ల్లో తలపడిన పీవీ సింధు ఆరింట్లో మాత్రమే నెగ్గింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్ షిప్‌లోనూ సింధుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఒకుహరను ఎదుర్కొన్న సింధు తీవ్ర ఒత్తిడికి గురవడం సహజమే.

అయితే అంత ఒత్తిడిలోనూ అద్భుతమైన ఆట తీరుతో ఒకుహరను మట్టికరిపించి గతంలో తన ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకుంది.  బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ ఫైనల్ మ్యాచ్‌లో రెండో సీడ్ క్రీడాకారిణి ఒకుహర(జపాన్)పై సింధు అద్బుతమైన పోరాట పటిమను కనబరిచింది.

తొలి సెట్‌లో 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోర్‌ను సమం చేసింది. ఈ క్రమంలో ఒత్తిడిని ఎదుర్కొన్న సింధు ఆ తర్వాత జోరు పెంచి వరుస పాయింట్లతో తొలి సెట్‌ను గెలుచుకుంది.


రెండో సెట్‌లోనూ దుమ్మురేపిన సింధు…

ఆ తరువాత రెండో సెట్‌లోనూ సింధుదే పైచేయి అయింది. ఒక దశలో ఒకుహరాతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయినా ఎక్కడా ఆధిక్యాన్ని కోల్పోకుండా చివరి వరకు అదే జోరును కొనసాగించి ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సింధు కైవసం చేసుకుంది. అంతేకాదు, ఈ విజయంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

- Advertisement -