హైదరాబాద్: భార్య పరువు తీయ్యలన్న ఉదేశంతోపాటు ఆమె నుంచి విడాకులు తీసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఆమె ఆశ్లీల ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడంతో పాటు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భర్త, అతడి ప్రియురాలిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం… ఆస్ట్రేలియాలో బీబీఏ చదివిన హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఆలపాటి తులసీదాస్ ప్రస్తుతం ఏ పని లేకుండా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు.
ఎస్‌వీ యూనివర్సిటీ నుంచి ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన మోనిక హైటెక్ సిటీలో మేనేజర్‌గా పని చేస్తోంది. మనస్పర్థల వల్ల భర్త ఈశ్వర్‌కు దూరంగా ఉంటున్న మౌనికకి ఈ ఏడాదిలో మే నెలలో ఈశ్వర్ నుంచి విడాకులు కూడా మంజూరయ్యాయి.
ఈ క్రమంలో బంజారాహిల్స్‌లో 2017లో జరిగిన సెక్యూరిటీ సర్వీసెస్ మీటింగ్‌లో తులసీదాస్‌కి మోనికతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం మెల్ల మెల్లగా ప్రేమగా మరి ఆ తరువాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే తులసీదాస్‌కి అప్పటికే వివాహమైంది.
ఎలాగైనా భార్య పరువు తీయాలని…
వీరి వివాహేతర విషయం తెలిసిన తులసీదాస్ భార్య వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో ఈ మేలో ఫిర్యాదు చేసింది. దీంతో తులసీదాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నభార్యపై తులసీదాస్‌తోపాటు అతడి ప్రియురాలు మోనిక కక్ష పెంచుకున్నారు. భార్య ప్రతిష్టను ఎలాగైనా దిగజార్చి, తొందరాగా ఆమె నుండి విడాకులు వచ్చేలా తులసీదాస్ ఒక ప్రణాళిక రచించాడు.
గతంలో భార్యతో తులసీదాస్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను మోనికాకు పంపాడు. దాంతో మోనిక ఆ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో అప్‌డేట్ చేయడమేకాక.. ‘డబ్బు కోసం ఏమైనా చేస్తుంది… కట్టుకున్న భర్తను జైలుకు కూడా పంపించింది..’ అనే కామెంట్ కూడా పెట్టింది. అంతటితో ఆగకుండా అభ్యంతరకరమైన మెసేజ్ కూడా పంపింది.
దీంతో కలత చెందిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మాదాపూర్‌లో తులసీదాస్, అతడి ప్రియురాలు మోనికను అరెస్టు చేశారు.