తెలంగాణ ఓటర్ల జాబితాపై జరుగుతున్న విచారణలో గురువారం ఉమ్మడి హైకోర్టు.. ఎన్నికల సంఘం(ఈసీ)కి షాక్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలోని నకిలీ ఓట్లను తొలగించాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో దాదాపు 38 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారనీ, అర్హులైన చాలామందిని తొలగించారని కాంగ్రెస్ నేత మర్రి శశిథర్ రెడ్డి తరఫు న్యాయవాది రవిశంకర్ కోర్టుకు తెలిపారు. ఈ జాబితాను వెంటనే సవరించి కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈసీ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు…
కానీ ఈ వాదనను ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. రోజుకో పిటిషన్ దాఖలు చేయడం కారణంగా తమపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందనీ, వెంటనే పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఎన్నికల సంఘం వాదనను తోసిపుచ్చింది. ఓటర్ల జాబితాలోని నకిలీ ఓట్లను తొలగించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
నెట్ స్లోగా ఉందా? ఇదీ ఒక కారణమేనా?
ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫున న్యాయవాది రవిశంకర్ మాట్లాడుతూ.. పాత ఓట్లను తొలగించకుండా కొత్త ఓట్లను జారీ చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలు, ట్రిపుల్ ఎంట్రీలు ఉన్నాయని వెల్లడించారు. ఈ జాబితాను సవరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు.
ఓటర్ల తొలగింపు విషయంలో ఈఆర్వో నెట్ స్లోగా ఉందని ఈసీ అధికారులు కోర్టుకు చెప్పారనీ, మరి నెట్ స్లోగా ఉన్నప్పుడు కొత్త ఓటర్లను మాత్రం ఎలా నమోదు చేయగలుగుతున్నారని రవిశంకర్ ప్రశ్నించారు. దీనికి ఈసీ అధికారుల దగ్గర సరైన సమాధానమే లేదంటూ ఆయన విమర్శించారు.