విశాఖపట్నం: విశాఖ నగరంలో కలకలం సృష్టిస్తున్న చెడ్డీ బనియన్ గ్యాంగ్ ఆట కట్టించారు అక్కడి పోలీసులు. చెడ్డీ బనియన్ వేసుకుని విశాఖపట్నంలో కొద్ది రోజులుగా రాత్రిళ్ళు ఇళ్లలో దొంగతనలకు పాల్పడుతున్న చెడ్డీ బనియన్ గ్యాంగ్ ముఠాలోని నలుగురిని గాజువాక క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పోలీస్ కమిషనరేట్ ఆవరణలోని సమావేశ మందరింలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో క్రైమ్ డీసీపీ ఏఆర్ దామోదర్ ఈ వివరాలు వెల్లడించారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా, గర్బడ మండలం సహాద గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు విశాఖకి వచ్చి చెడ్డీ, బనియన్ గ్యాంగ్ పేరుతో రాత్రిళ్ళు తాళం వేసి ఉన్న 15 ఇళ్లలో దొంగతనలకు పాల్పడ్డారు.
గుజరాత్‌కు వెళ్లి మరీ…
బాధితుల నుండి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఈ దొంగతనాలపై కేసులు నమోదు చేశారు. గాజువాక క్రైమ్ సీఐ కె.పైడపునాయుడు సిబ్బందితో కలిసి గుజరాత్ వెళ్లి విశాఖలో దొంగతనాలకు పాల్పడిన రామ బాధ్రియ (47), గనవ భారత్‌సింగ్ (45), కిషన్ బాధ్రియ (35), రావోజి బాధ్రియ (25) లను అరెస్టు చేసి విశాఖపట్నానికి తీసుకువచ్చారు.
విచారణలో వారు దొంగతనాలు చేసినట్టుగా తమ నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 264 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్టు క్రైమ్ డీసీపీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్ ఏడీసీపీ సురేష్‌బాబు, క్రైమ్ ఏసీపీ ఫాల్గుణరావు, సీఐ కె.పైడపునాయుడు తదితరులు పాల్గొన్నారు.