అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం నుంచి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన కార్యాలయం గురువారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఇటీవల పవన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో పవన్ జనసేన సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం విజయవాడలోని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం మీదుగా పవన్ తునికి చేరుకుంటారు.
పర్యటన తొలిరోజున తునిలోని గొల్ల అప్పారావు సెంటర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. రానున్న ఎన్నికల కోసం జనసేన కేడర్‌ను సన్నద్ధం చేయడంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేపట్టనున్నారు. తన పర్యటనలో భాగంగా జిల్లా ప్రజలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు.