పాకిస్తాన్, చైనా మధ్య బస్సు సర్వీస్.. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

Pak China
- Advertisement -

Pak China

న్యూఢిల్లీ:  పాకిస్తాన్‌, చైనా దేశాల మధ్య జరిగే చర్యలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్, చైనా మధ్య త్వరలో బస్సు సర్వీస్ మొదలుకానుంది. పాకిస్తాన్‌లోని లాహోర్‌,  చైనాలోని కాష్గార్‌ల మధ్య ఈ బస్‌ సర్వీస్‌ నవంబర్‌ 3న లేదా 13న ప్రారంభం కానుంది. సీపెక్ ప్రాజెక్టులో భాగంగా చైనా ఈ సర్వీసును నడపనుంది.

అయితే ఈ బస్ సర్వీస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతుండడంతో భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. మొదట ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) నిర్మిస్తున్నామని తెలిపారని.. ఇప్పుడు ఏకంగా బస్‌ సర్వీస్‌ మొదలుపెట్టారని.. ఈ విషయాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.

భారత సార్వభౌమాధికార ఉల్లంఘనే…

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గుండా బస్‌ సర్వీస్‌ నడపడం.. భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, పాకిస్తాన్-చైనాల చర్య భారత దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని ఆయన పేర్కొన్నారు.

చైనా-పాకిస్తాన్‌ మధ్య రూపుదిద్దుకున్న ‘సరిహద్దు ఒప్పందం 1963’ సక్రమమైంది కాదు, దానికి కాలం చెల్లింది..’ అని కూడా రవీష్‌ వ్యాఖ్యానించారు. విలువలేని ఈ ఒప్పందాన్ని భారత్‌ ఎన్నడూ ఆమోదించబోదనీ, ఈ బస్ సర్వీస్‌ ముమ్మాటికీ ఉల్లంఘనలతో కూడుకున్నదేనని ఉద్ఘాటించారు.  దీనిని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.

చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ విషయానికి వస్తే.. 50 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టును చైనా 2015లో మొదలుపెట్టింది. ప్రాజెక్టులో భాగంగా.. చైనా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ వెంట రహదార్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్, పాకిస్తాన్‌లోని గద్వార్ పోర్టు మధ్య ఈ ప్రాజెక్టు నిర్మాణమవుతుంది.

 

- Advertisement -