అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలాకాలం పనిచేసిన రవితేజకు..సినిమా కథలు, వాటి ఫార్ములాలు కొట్టిన పిండి.. యాక్షన్ విత్ కామెడీ ప్లస్ రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్.. ఉదాహరణకి.. ఈడియట్, అమ్మా, నాన్న తమిళ అమ్మాయి.. అందుకే ఒక టైమ్ లో ఆయన సినిమాలు.. ఒక రేంజ్ లో వెళ్లాయి.. అయితే ఆయనది ఒక ఫార్ములా రేస్..
శ్రీనువైట్ల కూడా…ఇదే తరహాలోనే తనకంటూ ఒక ఫార్ములా పట్టుకొని.. దానికి కామెడీ, యాక్షన్ ముడిపెట్టి ఇన్నాళ్లూ సక్సెస్ అయ్యారు. ఆయన నేను ఫార్ములా మార్చాను.. మార్చాను.. అని ఎంత చెప్పినా.. ఆ పాత మూస ధోరణిలోనే వెళ్లిపోతున్నారు. దానికి ఒక సరి కొత్త ఉదాహరణ.. తాజాగా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’..ఈ సినిమా కోసం.. ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్లిపోయారు.. అయితే ఆయన ఇంకొంచెం టైమ్ తీసుకుంటే బాగుంటుందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అదీ శ్రీను వైట్లకు కాబట్టి.. ఇన్ని అవకాశాలు వచ్చాయి.. ఆ పేరు నిలబెట్టుకోవాలని కొందరు పేర్కొంటున్నారు.
ఒకటే ఫార్ములాను పట్టుకొని…
గుణశేఖర్, పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, వీవీ వినాయక్, వీళ్లందరూ ఒక ఫార్ములాను పట్టుకొని సక్సెస్‌లు సాగినంత కాలం ఎడాపెడా తీసుకుంటూ వెళ్లిపోయారు. ఒక్కసారి ఒక జనరేషన్ మారింది..అంతే వీరి టెక్నిక్ పనిచేయడం లేదు. అలా పట్టుకొని..పట్టుకొని..సాగి..సాగి..లాగి..లాగి..అవస్థలు పడి..ఇక లాభం లేదురా బాబూ.. అంటూ కొందరు తెర వెనక్కి వెళ్లిపోయారు. బహుశా పూరీ జగన్నాథ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.
దర్శకుడు తేజ మాత్రం.. ఒక డిఫరెంటు కాన్సెప్ట్ తో.. ‘నేనే రాజు.. నేనే మంత్రి’.. చేసి సక్సెస్ అయ్యారు. కానీ ఈ సబ్జక్టు పట్టుకొని ఆయన సురేష్ ప్రొడక్షన్ చుట్టూ చాలాకాలం తిరిగినట్టు భోగట్టా. విసుగు లేకుండా ఎన్నో మార్పులు చేసి.. చివరకు సక్సెస్ అయ్యారు. ఆయన కూడా ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’..లాంటి యూత్ ఎంటర్‌టైన్‌మెంట్లు చేసి.. ఎన్ని ప్లాఫ్ లు తగిలినా..అదే కోవలో చేసుకుంటూ పోయాడు. చివరికి రియలైజ్ అయ్యాడు.వీళ్లు మారాం..మారాం..అంటున్నారు గానీ.. ఆ పాత ఫార్ములా చట్రంలోనే పోతూ.. ప్రేక్షకుల సహనానికి పరీక్షలు పెడుతూ.. ఉన్నట్లుండి ఎక్సలేటర్ రైజ్ చేస్తూ.. దేనికో దానికి ఢీ కొట్టేస్తున్నారు.
మణిరత్నం, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లే…
ఒకనాడు వెండితెరకు అద్భుతాలు చూపించిన మణిరత్నం, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లే ఢింకీలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు యువతరం పల్స్ దొరకడం లేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి.ఒకప్పుడు మణిరత్నం తీసిన ‘నాయకుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా అంటే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఎంతో ఇష్టమని తర్వాత తెలిసింది. అందుకే ఆ తరహాలోనే మణిరత్నం.. రజనీతో తీసిన ‘దళపతి’ సంచలనం సృష్టించింది.
ఆయనదొక డిఫరెంట్ మేకింగ్…
ఆ సినిమాలోనే అరవింద్ స్వామి తెలుగుతెరకు పరిచయమవడం విశేషం. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ని పరిచయం చేసిందీ మణిరత్నం కావడం విశేషం. అసలు ఆయన సినిమా మేకింగ్ ఎంతో డిఫరెంట్ అని చెప్పాలి. ‘ఇద్దరు’ అని తమిళనాడు రాజకీయాలపై.. ఎంజీఆర్, కరుణానిధిల స్నేహంపై తీసిన సినిమా పిక్చరైజేషన్.. ఒక అద్భుతం. కాకపోతే.. ఆ సినిమా ఆడలేదు.. అది వేరే విషయం.
ఆ సినిమాటో్గ్రాఫర్ సంతోష్ శివన్.. అదే ఫొటో్గ్రాఫర్ మహేష్ బాబుతో ‘స్పైడర్’ సినిమాకి పనిచేశారు. అయితే ఆ కెమెరా పనితనం.. ఈ సినిమాలో కనిపించక పోవడం ఆశ్చర్యమే. ఈమధ్య కొత్తగా వచ్చిన ‘నవాబ్’ కూడా ఆడకపోవడంతో.. ఈకాలం యువతకు మణిరత్నం ఆలోచనలు దూరమైపోతున్నట్టుగానే భావించాలి.
ఇక సంగీత దర్శకులు ఇళయరాజా లాంటివాళ్లే తెరమరుగైపోయారు. ఇళయరాజాది సంగీతంలో ఒక స్వర్ణయుగం.. అని చెప్పాలి. సున్నితమైన సంగీతంతో, లలిత గీతాల తరహా మాధుర్యంలో.. వయోలిన్, గిటార్, పియానో లాంటివి మాత్రమే వాడుతూ.. డ్రమ్స్ ఎక్కడో పాట మొదట్లో మాత్రమే ఉపయోగించి.. పాట చక్కగా తియ్యగా తేనెంత మాధుర్యంగా వినిపించడం ఆయనకే చెల్లింది.
అయితే వాటిని అంతే చక్కగా ఎస్పీబాలు, చిత్ర, జానకి లాంటి వాళ్లు ఆలపించి.. ఆయన సంగీతానికే వన్నె తీసుకొచ్చారు. ఇప్పుడా సంగీతం లేదు.. కానీ నాటి పాటలు మాత్రం ఆజరామరంగా నిలిచాయి. మరి ఇప్పుడా ఇళయరాజా ఎక్కడ? ఆయన కొడుకొచ్చాడు.. యవన్ శంకర్ రాజా.. నేటి కుర్రకారుకి ఆయనవి నచ్చుతున్నాయి మరి..
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే…
ఈ ‘ఫార్ములా’ రేస్ లో వీళ్లందరూ.. ఒకే తరహా ఆలోచనలతో ముందుకెళ్లి.. తలకు బొప్పి కట్టించుకుంటున్నారు. అయినా వారి పాత పంథా మారడం లేదు. ఒకప్పుడు అద్భుతమైన సక్సెస్‌లు చూసిన వీరు.. ఆ ఫార్ములాను పూర్తిగా వదల్లేకపోతున్నారు. అలాగే ఈ నవతరం, సాఫ్ట్ వేర్ కుర్రకారు, ఈ డబ్బులు వచ్చేఆదాయ మార్గాల్లో నిత్యం తేలియాడుతూ.. సంస్కృతి సంప్రదాయాలను గాలికి వదిలేసి, పెద్దలను, టీచర్లను గౌరవించకుండా, ఎవరైనా మంచి చెబుతుంటే వెటకారం చేస్తూ ముందుకు వెళ్లే వాళ్లకి.. ఆనాటి దర్శకుల సినిమాలు, ఫార్ములాలు ఎందుకు నచ్చుతాయి.
ఎలాంటివి నచ్చుతాయంటే…
అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, మధ్యలో రిలీఫ్ కోసం ‘గీత గోవిందం’, మహానటి లాంటివి చూస్తున్నారు. ఒకప్పుడులా అతిశయోక్తులు, అపోహలు, అద్భుతాలు.. అభూత కల్పనలు..నేటి యువత ఆశించడం లేదు. సినిమా సహజంగా ఉండాలి.. అంటే ఒక ఆర్ట్ ఫిలింలా..అంటే మహానటి సినిమాలా.. అందులో చిన్న మెసేజ్.. లేదంటే.. రెండున్నర గంటల మంచి ఎంటర్ టైన్ మెంట్ (గీత గోవిందం).. లేదా యూత్ ఫ్లేవర్ ( అర్జున్ రెడ్డి).
ఇదండీ సంగతి.. వీళ్లు ఒక ఫార్ములాతో కొన్నేళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక సినిమా హిట్టయితే రెండోది వస్తుంది. అది పోయిందంటే అంతే సంగతులు.. లేదా మరొక్క అవకాశం అంతే.. అది కూడా ప్రూవ్ చేసుకోవాలి.. అప్పుడే నిలబడతాడు. లేదంటే ఇండస్ట్రీ చుట్టూ తిరగడమే. అందుకే పెద్ద హీరోలు కూడా మాస్ ఫార్ములా అంటూ అందులో ఇరుక్కుపోతే.. మళ్లీ బయటికి రాలేరు.. ఎందుకంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నచ్చకపోతే.. మూడో రోజే డబ్బా తిరిగి వచ్చేస్తోంది. అందుకని ఫార్ములా పంజరంలో చిక్కుకోకండి.. బయటపడండి.. స్వేచ్ఛా సినిమా గీతం ఆలపించండి.. అంటున్నారు యువతరం సినీ పండితులు.
-శ్రీనివాస్ మిర్తిపాటి