ఒకరోజున ఒక సామాజిక వర్గం.. ఒక పేరుతో భారీ సభకు పిలుపునిచ్చింది.. పార్టీలకతీతంగా ఆ సామాజిక వర్గ ప్రజలందరూ వేలాదిగా తరలివెళ్లారు.. అక్కడ భారీ బహిరంగ సభ జరిగింది.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. అధికార పార్టీలో కొందరు.. ఈ సభకు పరోక్షంగా, ప్రత్యక్షంగా, ఆర్థికంగా.. ఇలా అన్ని రకాలుగా సహకారం అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఉప్పెనలా తరలివచ్చిన ఆ జనం, ఆ స్పందన చూసిన రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టింది. సహజంగానే అధికార పక్షంలో కూడా ఆ ప్రకంపనలు కనిపించాయి. దాంతో అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. ప్రస్తుతం వివాదస్పదంగా మారుతున్నాయి. ఎన్నికల ముందు ఇవెలాంటి ప్రతికూలతకు దారితీస్తాయో అని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అధినేత ఏకపక్షంగా.. ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉండగా, అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేవిగా ఉంటున్నాయి.
ఉన్న పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతుండటంతో.. తెలుగుదేశం పార్టీలోని బీసీ నాయకులందరూ నివురుగప్పిన నిప్పులా ఏ క్షణమైనా బద్దలయ్యేలా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ అసంతృప్తులను చల్లార్చకపోతే.. రాష్ట్రంలోనే కాదు.. జిల్లాల్లో కూడా గట్టి దెబ్బే తగిలేలా ఉందనేది ఒక వర్గం చెబుతున్న మాట.
ఎప్పటికప్పుడు పార్టీల సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ముందు ఎవరూ నోరెత్తకపోయినా.. అంతర్గత సమాచారం ద్వారా తెలుసుకొని.. రాబోయే ఎన్నికల్లోపైనా సరిదిద్దుకుంటారని పార్టీ అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే ఒక్క తూర్పుగోదావరి జిల్లానే తీసుకుంటే.. ఇన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడంపై బీసీలు మండిపడుతున్నారు. ఈ మంటలు ఇతర జిల్లాలకు పాకకుండా ఉండేలా పార్టీ అధినేత తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
ఇదిగో.. ఒక ఉదాహరణ…
తూర్పు గోదావరి జిల్లాలో.. ఒక సామాజిక వర్గానికిచ్చిన పదవుల లిస్ట్ చూస్తే కళ్లు తిరగకమానదు. అంటే ఆ సామాజిక వర్గ బలం, ఒకే మాటపై నిలబడటం చూసి భయపడుతున్నారా.. అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యమని అనుకున్నా.. జిల్లా మొత్తమ్మీద చూసుకుంటే అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పార్టీలో నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటిలిజెన్స్ నివేదికలను ఒకసారి పరిశీలించమని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. ఒకే సామాజిక వర్గానికిచ్చిన పదవుల్లో కొన్ని…
1. కాకినాడ మేయర్
2. రాజమహేంద్రవరం మేయర్
3. కాకినాడ జడ్పీ చైర్మన్
4. ఏడు మున్సిపాలిటీల్లో 5 మున్సిపాలిటీలు వారివే..
5. రాష్ట్రంలో, తూర్పులో కీలక మంత్రి పదవులు
6. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ
7. కనీస వేతన చట్టం అధ్యక్షుడు
8. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఇతనే లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్
9. డీసీసీబీ చైర్మన్
10. ఆప్కాబ్ వైస్ చైర్మన్..
ఇంకా జిల్లాలో వీరికి సంబంధించిన నిధుల విడుదల విషయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే ఉన్నతాధికారులుగా కూడా తీసుకువచ్చారు.. ఇలా వీటన్నింటిని చూసి… మొత్తం ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకున్న బీసీలందరూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పార్టీ మారి వచ్చినవాళ్లకి పదవులివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకరకంగా వారు విజయం సాధించినట్టేనని చెప్పొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర సామాజిక వర్గం వాళ్లు కూడా బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇటీవల అమలాపురంలో ఒక సామాజిక వర్గం భారీ సభ పెట్టి విజయం సాధించారు.
ఆరోజు ఆ సభకు పార్టీలకతీతంగా వెళ్లి.. ప్రభుత్వాలకు, పార్టీలకు తమ బలమెంతో చూపించడం, అందరూ ఒకే మాటపై నిలవడం.. వీటన్నింటినీ చూసి అందరూ అదే బాటన నడుస్తున్నారు. ఇదే తీరున నడిస్తే 19 నియోజకవర్గాల్లో.. ఈ ఇన్ బ్యాలెన్స్ వల్ల మిగిలిన నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని కొందరు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా ఈ బలప్రదర్శన సభలకు అన్ని పార్టీల వారు వెనుకనుండి తమవంతు సహకారం అందించడం, కొందరు మంత్రులు చూసీ చూడనట్టు ఉండటం చేస్తున్నారు. అధిష్ఠానాలకు తెలిసినా.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వచ్చేది ఎన్నికల కాలం.. ఎటు నుంచి ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు.
డిసెంబరు 16న కాకినాడలో పద్మశాలీ చైతన్యభేరి…
ఈ క్రమంలో డిసెంబరు 16 న కాకినాడలో పంపన రామకృష్ణ అధ్యక్షతన పద్మశాలీల చైతన్య భేరి కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. కార్తీకమాస వన సమారాధనల్లో పద్మశాలీలు, చేనేతలు, దేవాంగుల సమైఖ్యతతో వేలాదిగా తరలివచ్చి అందరూ ఒకే మాటపై ఉండటం, 175 నియోజకవర్గ్లాల్లో ఒక్క ఎమ్మెల్యే లేకపోవడం.. ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వకపోతే.. వీరందరి సంఘీభావం పార్టీల విజయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
సీట్ల కేటాయింపులో అందరికీ రాజకీయంగా సమ న్యాయం.. కల్పించాలని, తద్వారా ఎవరి సమస్యలను వారే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని..తమ ప్రతినిధికి చట్ట సభల్లో అవకాశం ఇవ్వాలని పద్మశాలీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
బీసీల పేరు చెప్పి.. పద్మశాలీలను వెనుకబాటుకు గురిచేస్తున్నారని, స్వాతంత్ర్యం వచ్చి 71 ఏళ్లు గడిచినా తమ జీవన పరిస్థితుల్లో మార్పులు రాలేదని, అందరూ కళ్లు చెదిరే షాపింగ్ మాల్స్ కడుతుంటే ఆప్కో స్లాల్స్ పాతకాలం నాటివి, ఎక్కడో మారుమూల చిన్న చిల్లర కొట్లుగానే ఉన్నాయని, సొసైటీలకు నిధులివ్వడం లేదని, చేనేత, జౌళి రెండింటిని విడదీయమని ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా.. పట్టించుకోవడం లేదని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే చేనేత వస్త్రాల ఫ్యాషన్ షోలు విరివిగా నిర్వహించాలని, ఏదో మొక్కుబడిగా కాకుండా.. సంప్రదాయ ఒరవడిని మేళవించి వాటిని నిర్వహించాలని చేనేత అభ్యుదయవాదులు కోరుతున్నారు. కొన్ని వేలమందికి పరిశ్రమలు పెట్టుకునేందుకు కోట్ల రూపాయల నిధులిస్తుంటారు.. వారికి సగానికి సగం సబ్సిడీలు, బ్యాంకు రుణాలు ఇస్తుంటారు..ఇన్నేళ్లలో పద్మశాలీల్లో ఎంతమంది ఇలా ప్రగతిబాట పట్టారని, ఎంతమంది పారిశ్రామికవేత్తలున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
పద్మశాలీలకు వస్త్ర దుకాణాలు తప్ప ఇంకేమున్నాయని, రుణాల కోసం వెళితే బ్యాంకర్లు వంద కొర్రీలు పెడుతుంటారని.. అదే ఇతర సామాజిక వర్గం వాళ్లు వెళితే రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కార్పొరేషను పెట్టి.. అడిగిన వారికి అడగని వారికి రూ.2 లక్షలు రుణం ఇచ్చి అందులో సగం సబ్సిడీ అన్నారు.. అదే పద్మశాలీలకు, చేనేతలకు ఒకేసారి అలా ఇచ్చి.. సగం సబ్సిడీ.. సింగిల్ విండోలో ఎప్పుడైనా ఇచ్చారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ జనాభాలో 4.93 కోట్ల మందిలో 60 లక్షల మంది ఉన్న వీవర్స్ కమ్యూనిటీలో అత్యధిక శాతం ఉన్న పద్మశాలీలకు, ఇంకా తమ శాఖల వారికి వచ్చే ఎన్నికల్లో కనీసం 12 నుంచి 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన వారికే తమ వారందరూ ఓటేస్తారని.. లేదంటే ఫలితం వెండితెరపై.. అంటే ఓట్ల బ్యాలెట్లపై చూడమని నేత కార్మిక, పద్మశాలీ నేతలు ఘంటాపథంగా నొక్కి చెబుతున్నారు.