సౌదీలో అరబ్ షేక్ దురాగతానికి బలైపోయిన హైదరాబాద్ మహిళ!

hyderabad-woman-died-in-riyadh
- Advertisement -

హైదరాబాద్: కుటుంబ అవసరాల కోసం నాలుగు డబ్బులు సంపాదించుకుందామని గంపెడాశతో సౌదీకి వెళ్లిన ఓ మహిళ అక్కడ యజమానుల దురాగతానికి బలైపోయింది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని షాహీనగర్‌కు చెందిన నస్రీన్ ఫాతిమా భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాస్తో కూస్తో సంపాదించుకుని వచ్చే భర్త హఠాత్తుగా చనిపోవడంతో నస్రీన్ ఫాతిమాకు దిక్కుతోచలేదు.

కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి…

ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి, వారికి పెళ్లిళ్లు కూడా చేయాలి. మరోవైపు రోజురోజుకీ పెరిగిపోతోన్న ఆర్థిక ఇబ్బందులు. దీంతో ఆమె సంపాదన కోసం ఎలాగైనా తాను గల్ఫ్‌కు వెళ్లాలని భావించింది.

ఇద్దరు ఆడపిల్లలను వదిలిపెట్టి.. 2017 ఆగస్టులో షాహెదా అనే మహిళా ఏజెంటు, ముంబైలోని మరో ఏజెంటు సహాయంతో సౌదీ అరేబియాలోని రియాద్ నగరానికి వెళ్లింది. అక్కడ అబ్దుల్లా అనే ఓ అరబ్ షేక్ ఇంట్లో పనికి కుదిరింది.

అయితే పనిలో చేరిన నాటినుంచే నస్రీన్ ఫాతిమాకు వేధింపులు ప్రారంభమయ్యాయి. రోజంతా కష్టపడి పనిచేసినా ఆమె యజమానులు మాత్రం చిత్రహింసలు పెట్టేవారు. సరైన తిండి కూడా పెట్టకుండా రోజుకు 15 గంటలు ఆమెతో పని చేయించేవారు.

ఏడాదికాలంగా జీతం కూడా ఇవ్వకపోవడంతో ఆమెకు ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. తాను తిరిగి తన దేశానికి వెళ్లిపోతానని అడగ్గా ఆమె యజమానులు అందుకు ఒప్పుకోలేదు.

ఈ నేపథ్యంలో నస్రీన్ ఫాతిమా చివరిసారిగా మే 14న హైదరాబాద్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడింది. వారికి జరిగినదంతా చెప్పి ఏడ్చింది. ఎలాగైనా తనను కాపాడాలని, స్వదేశానికి రప్పించాలని కోరింది.

ఇటీవల సౌదీ నుంచి ఆమె కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నస్రీన్ ఫాతిమా అనారోగ్యంతో చనిపోయిందని, ఆమె మ‌తదేహాన్ని ఆసుపత్రికి తరలించామని ఆమె పనిచేస్తోన్న యజమాని అయిన అరబ్ షేక్ ఫోన్‌లో వారికి ఈ సమాచారం అందించాడు.

అయితే మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నస్రీన్ ఫాతిమా హఠాత్తుగా ఎలా చనిపోతుందని హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆమె మ‌ృతిపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా, కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కూడా వారు ఫిర్యాదు చేశారు. తమ కోడలు నస్రీన్ ఫాతిమా మ‌ృతిపై విచారణ జరిపించాలంటూ ఆమె అత్త గౌసియా బేగం కేంద్ర మంత్రికి రాసిన లేఖలో అభ్యర్థించారు.

- Advertisement -