వావ్.. భలే ఆఫర్! ‘‘ఎంతైనా తినండి.. బిల్లులో సగం కట్టండి’’… ఎక్కడో తెలుసా?

rishi-sunak-eat-out-to-help-out
- Advertisement -

‘‘మీరు ఎంత తింటారో తినండి.. సగం బిల్లు కట్టండి చాలు..’’ అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎలాగుంటుంది? కుమ్మేయమా బాస్.. ఇంతకీ ఎక్కడ.. ఏదైనా రెస్టారెంటా? లేకపోతే ఆన్‌లైన్ ఆఫరా.. అంటారా?

ఆగండాగండి.. మీ జిహ్వ చాపల్యం మాకు అర్థమైంది. కానీ ఈ ఆఫర్ మన దేశంలో కాదులెండి.. బ్రిటన్‌లో. 

పైగా ఈ ఆఫర్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరో తెలుసా? రిషి సునక్. అదేనండీ.. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే కదా.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని, ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన వేళ.. బ్రిటన్‌లోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం కొత్తగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోన్న హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, బార్‌లు జనం రాక.. బిజినెస్ లేక చతికిలపడ్డాయి.

దీంతో బ్రిటన్ ప్రస్తుత ఆర్థిక మంత్రి రిషి సునక్ ఈ కొత్త స్కీమ్‌కు రూపకల్పన చేశారు. పైగా ఈ ఆఫర్ ఆగస్టు నెలల వచ్చిన తొలి సోమవారం.. అంటే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతోంది. 

‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’ అనే ఈ స్కీమ్ కింద ఈ నెలంతటా సోమవారం నుంచి బుధవారం వరకు ఎంపిక చేసిన 72 వేల రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌లు.. ఎందులోనైనా సగం ధరకే కడుపారా భుజించవచ్చు.

మినిమం ఇంత బిల్లు చేయాలనే షరతు కూడా లేదు. ఈ ఆఫర్ కింద ప్రతి ఒక్కరికి గరిష్ఠంగా 10 పౌండ్ల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. తిన్న తరువాత సగం బిల్లు కట్టేస్తే చాలు.

ప్రస్తుతం ఈ ఆఫర్ బ్రిటన్ దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అమలులో ఉంది. పైగా రోజుకు ఒక్కసారే అనే కండీషన్ కూడా లేదు. రోజులో ఎన్నిసార్లైనా, ఏ రెస్టారెంట్‌కైనా వెళ్లొచ్చు. కాకపోతే ఈ ఆఫర్ ఆల్కహాల్‌కు మాత్రం వర్తించదు. 

ఈ ఆఫర్ ప్రవేశపెట్టిన సందర్భంగా బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ మాట్లాడుతూ.. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోన్న రెస్టారెంట్లు, కేఫ్‌లు, బార్లు సంక్షోభంలో కూరుకుపోయిన వేళ వాటికి పునరుజ్జీవం పోయాల్సిన అవసరం ఉంది..’’ అన్నారు.

18 లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు కాపాడే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. దీనివల్ల ఇటు వ్యాపారాలను, అటు ఉద్యోగాలను కాపాడగలుగుతామని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

నిజమే.. మరి మన దేశంలోనూ కరోనా కారణంగా అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి కదా? మోడీ ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ఏదైనా తీసుకొస్తే.. అటు వ్యాపార నిర్వాహకులకు, ఇటు ప్రజలకు అందరికీ ఉపయోగకరమే కదా?

మరి మన దేశంలో ఆర్థిక మంత్రులకు ఇలాంటి అవిడియాలు ఎందుకు రావో? 

- Advertisement -