వాషింగ్టన్: ఎట్టకేలకు స్పేస్‌ఎక్స్ ‘క్రూడ్రాగన్’ భూమికి సురక్షితంగా చేరింది. అందులో ఉన్న అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు కూడా సురక్షితంగా భూమ్మీద కాలుమోపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం ఆరంభించిన ‘క్రూడ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ 19 గంటల ప్రయాణం తరువాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో నీటిపై ల్యాండ్ అయింది.
అయితే 45 ఏళ్ల తర్వాత మళ్లీ అమెరికా వ్యోమగాములు ఇలా సముద్రంలో దిగడం ఇదే తొలిసారి.
1975, జూలై 24వ తేదీన నాసా వ్యోమగాములు థామస్ స్టాఫర్డ్, వాన్స్ బ్రాండ్, డోనాల్డ్ స్లేటన్ హవాయి తీరంలో సముద్రంలో దిగారు. అపొలో-సొయోజ్ ప్రాజెక్టులో భాగంగా వాళ్లు ఆ యాత్ర చేపట్టారు.
ఇప్పుడు తాజాగా.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో సురక్షితంగా దిగారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన ‘క్రూడ్రాగన్’ ప్రయోగంతో ప్రైవేటు అంతరిక్ష ప్రయోగాల సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ మానవ సహిత అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది.
స్పేస్ఎక్స్‌కు చెందిన రాకెట్ ఎండీవర్ మే 30వ తేదీన ఈ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ను మోసుకుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. తిరిగి దాదాపు రెండు నెలల తరువాత మళ్లీ అక్కడ్నించి బయలుదేరి సురక్షితంగా భూమికి చేరుకుంది.
అయితే క్రూడ్రాగన్ భూమికి చేరే సమయంలో ఫ్లోరిడాలో వాతావరణం ప్రతికూలంగా మారింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ నాసా శాస్త్రవేత్తలు క్రూడ్రాగన్ ల్యాండింగ్‌కే మొగ్గుచూపారు.
దీనికోసం భూమ్మీద మొత్తం అయిదు ప్రదేశాలు ఏంపిక చేసి, ఆయా ప్రాంతాల్లో క్రూడ్రాాగన్ ల్యాండింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే నాసా వ్యోమగాములు రాబర్ట్ బెన్‌కెన్, డగ్లస్ హర్లేలతో కూడిన క్రూడ్రాగన్ మాత్రం.. ప్యారాచూట్ల సహాయంతో ఫ్లోరిడా తీరంలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
మరోవైపు స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూడ్రాగన్ సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల తర్వాత తమ దేశ వ్యోమగాములు నీటిలో దిగారని, చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
pic.twitter.com/s8DJb1LxQW https://t.co/MYOBJcSuLn
— Donald J. Trump (@realDonaldTrump) August 2, 2020