27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ‘వందేభారత్ మిషన్‌’లో ఘోర అపశ్రుతి.. విమాన ప్రమాదంలో పైలట్లు సహా 15 మంది దుర్మరణం.. 50...

‘వందేభారత్ మిషన్‌’లో ఘోర అపశ్రుతి.. విమాన ప్రమాదంలో పైలట్లు సహా 15 మంది దుర్మరణం.. 50 మందికి తీవ్రగాయాలు

kerala-air-india-express-plane-crash
- Advertisement -

తిరువనంతపురం: ‘వందేభారత్ మిషన్’‌లో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్‌కు వస్తోన్న విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌‌వేపై ప్రమాదానికి గురైంది. 

ఈ ప్రమాదంలో విమాన పైలట్లు ఇద్దరు, ఐదుగురు సిబ్బంది సహా 15 మంది మరణించారు. 50 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 100 మంది ప్రయాణికులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 

ఎయిరిండియాకు చెందిన డీఎక్స్‌బీ-సీసీజే బోయింగ్ 737 ఐఎక్స్ 1344 ఎక్స్‌ప్రెస్ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపు తప్పి రన్‌వే పైనుంచి 30 అడుగుల లోయలోకి పడిపోయి రెండు ముక్కలైంది. 

శుక్రవారం సాయంత్రం 7:45 గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, 7 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. 

భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు విమానాశ్రయంలోని రన్‌వేపైకి చేరడం వల్లే ప్రమాదం జరిగనట్లు ప్రాథమిక అంచనా. మరోవైపు ప్రమాదం సంగతి తెలియగానే దాదాపు 20 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్ బ‌ృందాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

మరో నలుగురు ప్రయాణికులు ఇంకా విమానంలో చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  

ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ విమన ప్రమాదంపై డీసీజీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. 

 

- Advertisement -