
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా ఎన్నడూ లేనంత స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ విషయంలో అమెరికాను సైతం తలదన్ని భారత్ ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం కూడా దేశంలో 60 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు.
శుక్రవారం ఒక్కరోజే దేశంలో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు నమోదుకాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 20,88,612కు చేరుకుంది.
అంతేకాదు, దేశంలో ఒక్కరోజులో మరణాలలోనూ మనం రికార్డు నమోదు చేశాం. అంటే గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో శుక్రవారం ఒక్కరోజే 933 మంది కరోనా కాటుకు బలయ్యారు.
కరోనాతో అల్లాడుతోన్న అగ్రరాజ్యం అమెరికాలోనూ ప్రస్తుతం రోజువారీ ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం లేదు. అక్కడ రోజుకు పాజిటివ్ కేసులు 30-35 వేలు మాత్రమే.
గత వారం రోజులుగా అమెరికాను మించి మరీ రోజువారీ కేసులు మన దేశంలో నమోదు అవుతున్నాయి. ఈ నెల 1 నుంచి 8 వరకు లెక్కలు తీసుకుంటే.. అమెరికాలో 3,84,089 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.
అదే భారత్‌లో చూసుకుంటే.. 3,99,263 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు దేశంలో కరోనా మరింత విజృంభించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








