ప్రపంచానికే శుభవార్త!: మాట నిలబెట్టుకున్న రష్యా.. తొలి కరోనా వ్యాక్సిన్ విడుదల…

worlds-first-corona-vaccine-developed-by-russia-says-putin
- Advertisement -

మాస్కో: యావత్ ప్రపంచానికే ఇది శుభవార్త! చెప్పినట్లుగానే రష్యా ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తాజాగా ప్రకటించారు. 

మంగళవారం ఉదయం మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పుతిన్ మాట్లాడుతూ.. రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు, అది కరోనా వైరస్‌ను సమర్థంగా నిరోధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆగస్టులోనే కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు రష్యా శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారని అన్నారు. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని రాబోయే కొద్ది వారాల్లోనే భారీ స్థాయిలో చేపట్టి లక్షలాది డోసులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు.

పుతిన్ కుమార్తెకు వ్యాక్సిన్ డోసు…

రష్యాకు చెందిన గామలేయా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ‘స్పుత్నిక్-వి’గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఈ వ్యాక్సిన్ డోసును ఇప్పటికే ఇచ్చినట్లు కూడా పుతిన్ ప్రకటించారు. 

ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత తన కుమార్తె శరీరంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు దీటుగా అభివృ చెందాయని, ఈ వ్యాక్సిన్‌ డోసులను తొలుత వైద్య సిబ్బందికి, ఉపాధ్యాయులకు కూడా ఇస్తామని పేర్కొన్నారు. 

కరోనా వైరస్ ఆట కట్టించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు నిమగ్నమై ఉండగా, ఉన్నట్లుండి రష్యా కరోనా వ్యాక్సిన్‌ను తాము తీసుకొచ్చేసినట్లు ప్రకటించి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.

- Advertisement -